భయం అవసరం లేదిక..! క్యాన్సర్‌ను పూర్తిగా తరిమికొట్టే టెక్నాలజీ వచ్చేసింది

క్యాన్సర్.. ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి ఇది. ఒక్కసారి దాడిచేసిందంటే దాదాపు చచ్చే దాకా వదలదు. కీమో థెరపీ(Chemo therapy), రేడియేషన్ థెరపీలు వంటి అధునాతన చికిత్సలున్నా..


నయం అవుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్‌ రిస్క్‌తో కూడుకున్నది. క్యాన్సర్ కణాలను గుర్తించి తొలగించే క్రమంలో ఆరోగ్యకరమైన కణాలకు కూడా హాని కలిగి ప్రాణహాని ఏర్పడవచ్చు. కానీ రాబోయే సంవత్సరాల్లో అలాంటి భయం అవసరం లేదిక! ఎందుకంటే క్యాన్సర్ కణాలను(Cancer cells) పసిగట్టి, వాటిని మాత్రమే నిర్మూలించగల సరికొత్త టెక్నాలజీని కొరియన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

అధ్యయనంలో భాగంగా కొరియా అడ్వాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(KAIST) పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణ చేశారు. పెద్ద ప్రేగు క్యాన్సర్ కణాల జన్యు నెట్ వర్క్‌ను విశ్లేషించడానికి సిస్టమ్స్ బయాలజీ విధానాన్ని, అలాగే డిజిటల్ ట్విన్ సిమ్యులేషన్ విశ్లేషణను ఉపయోగించారు. ఈ సందర్భంగా వారు క్యాన్సర్ రివర్సల్‌ను ప్రేరేపించగల మాలిక్యులర్ స్విచ్‌ను ఈ కనుగొన్నారు. దీనిని పరీక్షించి, పరమాణు, సెల్యులార్ ప్రయోగాల ద్వారా నిర్ధారించారు. ఈ సరికొత్త డిజిటల్ ట్విన్ టెక్నాలజీ(Digital Twin టెక్నాలజీ) రోగుల్లో క్యాన్సర్ కణాలను చంపకుండానే, సాధారణ కణాలుగా మార్చగల ఒక వినూత్న సాంకేతికతను(Innovative technology developed)అభివృద్ధి చేశారు. ఇది క్యాన్సర్ చికిత్సలలో విప్లవాత్మక మార్పునకు దారితీస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇది సంప్రదాయ చికిత్సలైన కీమోథెరపీ, రేడియేషన్ థెరపీలకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెక్నాలజీకంటే మరింత భిన్నమైన, అధునాతనమైన టెక్నాలజీ.

క్యాన్సర్ చికిత్స సమయంలో ఈ టెక్నాలజీ శరీరంలోని సాధారణ కణాలకు ఏమాత్రం హాని కలగకుండా, క్యాన్సర్ కణాలను మాత్రమే పసిగట్టి, వాటిని ‘రివర్స్’ చేయడం ద్వారా సాధారణ స్థితికి తీసుకు వస్తుందని బయో అండ్ బ్రెయిన్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ క్వాంగ్ – హ్యూన్ చో (Researcher Professor Kwang – Hyun) పేర్కొన్నాడు. దీని వివరాలు ” అడ్వాన్స్‌డ్ సైన్స్” అనే ఇంటర్నేషనల్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. కాగా ఈ సాంకేతికత ద్వారా భవిష్యత్‌లో వివిధ రకాల క్యాన్సర్లను ఎదుర్కోవడం సులభతరం అవుతుందని పరిశోధకులు అంటున్నారు. ఇప్పటి వరకున్న సంప్రదాయ చికిత్సకు భిన్నంగా పని చేస్తుంది. చికిత్సల సమయంలో ఎలాంటి పార్శ్వ ప్రభావాలు ఉండవు. ముఖ్యంగా వికారం, జుట్టు రాలడం, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటివి జరగవు. ఈ పరిశోధన ఆధారంగా మరిన్ని కొత్త ఔషధాలు లేదా చికిత్సలకు అవసరమైన సాంకేతికతను కూడా కనుగొనడానికి అవకాశం ఏర్పడిందని రీసెర్చర్స్ అంటున్నారు.