ఏంటి చెల్లీ నిజాలు చెప్పేసి ప్రాణాలు పోగొట్టుకోవాలా?

వైసీపీని, ఎంపీ పదవిని వీడిన విజయసాయి రెడ్డి హరిశ్చంద్రుడు తర్వాత తాను మాత్రమే అన్నీ నిజాలు మాట్లాడుతుంటానంటారు. కానీ ఆయన మాటలని ఏ ఒక్కరూ నమ్మడం లేదు.


పైగా ఎందుకు అలా చేశారో? అని ఆరాలు తీస్తున్నారు.

వారందరికీ సమాధానాలు చెప్పేందుకు జగనన్న ప్రస్తుతం దేశంలో లేకపోవడంతో, ఆయన తోడబుట్టిన చెల్లి షర్మిల ఆ బాధ్యత తీసుకున్నారు.

విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “జగన్‌ ఓ ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ నాయకుడుగా పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారు. అందుకే ప్రజలు ఆయనని ఎన్నికలలో ఓడించారు. అందుకే ఆయనని నమ్ముకున్న నావంటి కుటుంబ సభ్యులతో సహా అందరూ విడిచిపోతున్నారు. విజయసాయి రెడ్డి కూడా అందుకే జగన్‌కి గుడ్ బై చెప్పేశారు.

ఇంతకాలం జగన్‌ ఎవరిని తిట్టమంటే వారిని ఆయన తిట్టేవారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డనైన నన్ను కూడా ఆయన విడిచిపెట్టలేదు. నాపై లేనిపోని అభాండాలు వేస్తూ చాలా మాట్లాడారు. జగన్‌ చెప్పినందునే ఆయన నా గురించి అలా మాట్లాడారని నాకూ తెలుసు.

సరే! జరిగిందేదో జరిగిపోయింది. జగన్‌ కోసం ఇంత నీచానికి దిగజారిపోయిన మీకు జగన్‌ తిరిగి ఏమిచ్చారు? ఏం చేశారు?మీరు ఊరికే రాజీనామా చేయలేదని అందరికీ తెలుసు. మీ రాజీనామాకి కారణం లేదంటే ఎవరూ నమ్మరు. కనుక ఆ అసలు కారణాలు ఏమిటో మీరే చెప్పండి.

ఇప్పుడు మీరు జగన్‌ కోసం పనిచేయడం లేదని చెప్పుకున్నారు. మీరిప్పుడు వైసీపీలో లేరు పదవిలో కూడా లేరు. ఈ మాట నిజమే అయితే ఇప్పటికైనా మీరు జగన్‌ గురించి మీకు తెలిసిన నిజాలన్నీ బయటపెట్టండి.

ఆరోజు వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని అవినాష్ రెడ్డి మీకు చెపితే అదే చెప్పనన్నారు. కానీ నిజమేమిటో మీకు బాగా తెలుసు. మీకు కేసుల భయం కూడా లేదని చెప్పుకున్నారు. కనుక ఇప్పటికైనా ఆయన హత్య గురించి ధైర్యంగా నిజాలు బయటపెట్టండి. జగన్‌ ఎలాగూ విశ్వసనీయత కోల్పోయారు. కనీసం మీరైన నిజాలు బయటపెట్టి మీ విశ్వసనీయత నిరూపించుకోండి,” అని షర్మిల కోరారు.

షర్మిల అన్నని వీడినప్పటి నుంచి ఆమెని కూడా శతృవర్గం జాబితాలో చేర్చేశారు. కానీ ఆమె తెలంగాణలో ఉన్నంతకాలం వైసీపీలో ఎవరూ ఆమె గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలు తీసుకొని అన్నపై యుద్ధం ప్రకటించినప్ప టినుంచే వైసీపీ నేతలు, దాని సొంత మీడియా అందరి చేత ఆమెను నోరారా తిట్టిస్తున్నారు. కనుక విజయసాయి రెడ్డి కూడా మౌనంగా ఉన్నంత కాలమే వైసీపీ కూడా మౌనంగా ఉంటుంది. ఆయన నోరు విప్పితే ఆయనకీ షర్మిల గతే పడుతుంది.

పైగా ఆయనకు చాలా రహస్యాలు తెలుసు కనుక ఇప్పుడు ఆయన చాలా ప్రమాదంలో ఉన్నట్లే భావించవచ్చు. బ్రతికుంటే బలిసాకు తిని బ్రతకొచ్చు కనుక లేని విశ్వసనీయత నిరూపించుకోవడం చాలా ప్రమాదం.