అనకాపల్లి రూరల్, జనవరి 9: నిరవధిక సమ్మెలో పాల్గొంటున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగి మృతి అనకాపల్లిలో మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన మృతదేహంతో కుటుంబ సభ్యులు, ఉద్యోగులు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం ఎదుట ఐదు గంటలపాటు ఆందోళన చేశారు.
వివరాలిలా ఉన్నాయి. మునగపాక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న జడ్డు వాసుదేవరావు(ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగి) సమ్మెలో భాగంగా గతనెల 23న అనకాపల్లి మండలం కొండకొప్పాకలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో కూర్చున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో వెంటనే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు బ్రెయున్ స్ర్టోక్ వచ్చినట్టు వైద్యులు గుర్తించి శస్త్ర చికిత్స చేశారు.
అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న వాసుదేవరావు మంగళవారం మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని కొండకొప్పాకలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్షా శిబిరం వద్దకు తీసుకొచ్చారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుమారు 5గంటల పాటు ఆందోళన చేయడంతో
’ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న మంత్రి
బొత్స స్పందించి తక్షణం
రూ.2.25 లక్షలు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వివరించారు. మరొక రూ.10 లక్షలు కుటుంబానికి ఇస్తామని, వాసుదేవరావు భార్యకు సమగ్ర శిక్షలో ఉద్యోగం ఇస్తామని బొత్స హామీ ఇచ్చినట్టు పీలా తెలిపారు. ఆ తర్వాత ఆందోళన విరమించి, మృతదేహాన్ని తరలించారు.