ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా.? నిజమెంత.?

www.mannamweb.com


ఎందులోనూ లేని రెండు ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ మొబైల్‌కు ఛార్జింగ్ అవసరమే లేదు. ఇది సూర్యకాంతితో ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవుతుంది. ఇది మీ జేబులో ఉన్నా కూడా ఛార్జ్ అవుతూనే ఉంటుంది అంటూ ఓ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో ఇటీవల చక్కర్లు కొడుతోంది. ఇంకా ఆ మొబైల్‌ స్పెషాల్టీ ఏమిటంటే దానికి అసలు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమే లేదని.. అది టెస్లా ఇంటర్నెట్ స్టార్‌లింక్ ఉపగ్రహంతో పని చేస్తుందని తెలుస్తోంది. మీరు ఎక్కడ ఉన్నా, ఆఖరికి చంద్రునిపైన కూడా, ఈ మొబైల్ ఇంటర్నెట్ పని చేస్తూనే ఉంటుందని అంటున్నారు. అంటే సిగ్నల్ సమస్యే ఉండదు. సో.. ఫోన్, డేటా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి అంటూ ఊరిస్తున్నారు. అయితే ఇలాంటి వార్తలు గత కొద్ది రోజుల నుంచే వినపడుతున్నాయి. అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా ఉందంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఎలన్ మస్క్ ఈమధ్య ఫిలడెల్ఫియాలో ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో స్వయంగా ఈ మొబైల్ వార్తల్ని కొట్టిపారేశాడు. తను క్లియర్‌గానే చెప్పాడు… ‘‘అలాంటి ఫోన్లను మేం చేయలేమని కాదు, కానీ ఇప్పుడు అవసరం లేదు, మా ఆలోచనల్లో అది లేదు, మా ప్రయారిటీల్లో కూడా అది లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు. ఒకవేళ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ మార్కెట్‌లోకి వస్తాం అని హింట్ కూడా ఇచ్చాడు. అయితే కొత్తగా ఇప్పటికిప్పుడు మొబైల్ ఫోన్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టే ఆలోచన లేదు.. అవసరం లేదు అనేది ఫైనల్‌ సమాధానం. అయిన టెస్లా ఫోన్‌పై పోస్టులు కనిపిస్తూనే ఉంటాయి.

అయితే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫీచర్లను చూస్తే మాత్రం ఆశ కలగక మానదు. అదే ఆశతో ఇలాంటి పోస్టులు సృష్టిస్తున్నారేమో అనిపిస్తుంది. నిజంగా మొబైల్‌ ఫోన్‌లో అలాంటి ఫీచర్లు సాధ్యమేనా..? అనే చర్చ కూడా మొదలైంది. సూర్యరశ్మి ద్వారా మొబైల్‌ చార్జ్‌ చేసుకోవడం అనేది ప్రయోగాలు చేస్తే పెద్ద కష్టమేమీ కాదనేది మరికొందరి వాదన. టెక్నాలజీని ఓ ఆటాడేసుకునే మస్క్ టీమ్‌కు అసాధ్యమేమీ కాకపోవచ్చంటున్నారు నిపుణులు. స్టార్‌లింక్ ఉపగ్రహం నుంచి నేరుగా మొబైల్‌కు కనెక్టివిటీ అనేది కూడా టెక్నాలజీ రీత్యా సాధ్యమయ్యే పనే. శాటిలైట్ ఫోన్లు ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్నాయి. మస్క్ కంపెనీ నుంచి చీప్ అండ్ ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్‌తో మొబైల్స్‌ వస్తే మాత్రం మంచి ఆదరణ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రుడి మీద ఉన్నా, అంగారకుడి మీద ఉన్నా సిగ్నల్ సమస్య ఉండదు అనేది మరో ప్రచారం. ఇది కొంత అతిశయోక్తిగానే అనిపించవచ్చు. అయితే ఎట్లాగూ ఒకవేళ నిజంగానే స్టార్‌లింక్‌తో అనుసంధానమైతే అది అసాధ్యమూ కాకపోవచ్చు. కానీ అక్కడ వాడేవాడు ఎవరు అనేదే అసలు సమస్య.