టీజీ ఈఏపీసెట్ -2026 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభమవుతాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
ఫిబ్రవరి 19 నుంచి దరఖాస్తులు…
ఫిబ్రవరి 14న టీజీ ఈఏపీసెట్ – 2026 నోటిఫికేషన్ అందుబాటులోకి వస్తుంది. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఇక పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే.. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడించారు.
అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ సీట్ల మిగిలితే… స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేస్తారు.
ఈసారి కూడా జేఎన్టీయూనే ఎంట్రెన్స్ బాధ్యతలను చూడనుంది. ఇంటర్, జేఈఈ పరీక్షల దృష్ట్యా…ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణ కోసం ముందుగానే కసరత్తు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ను ఖరారు చేశారు. మొత్తంగా చూస్తే… విద్యా్ర్థులకు ఇబ్బందులు రాకుండా ఈఏపీసెట్ షెడ్యూల్ ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు.
గతేడాది ఏప్రిల్ చివరి, మే మొదటి వారంలో ఈఏపీసెట్ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్, ఫార్మాసీ స్ట్రీమ్ పరీక్షలను వేర్వురు తేదీల్లో నిర్వహించారు. ప్రాథమిక కీలను విడుదల చేసిన తర్వాత….మే రెండో వారంలో ఫలితాలను ప్రకటించారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు… సీట్ల భర్తీని పూర్తి చేశారు.

































