దేశం బానిస సంకెళ్లు తెంచుకుని, పరాయి పాలన నుంచి విముక్తి పొంది 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది. కాగా, ఈ శుభ సందర్భంలో హైదరాబాద్ నగరంలోని కొన్ని మసీదు కమిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
సర్వమత సౌభ్రాతృత్వమే లక్ష్యంగా.. అన్ని మతాల మధ్య సత్సబంధాలను నిర్మించే ప్రయత్నంలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని మస్జిద్-ఎ-మదీనాను ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెరవనున్నారు. అన్ని మతాల ప్రజలను మసీదులో ప్రవేశానికి అనుమతిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో నగరంలో ఈ నిర్ణయం తీసుకుని నాలుగు మసీదులు తలుపులు తెరవగా.. ఇది ఐదోవది. ఈ మేరకు ఆగస్టు 15న ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్ని మతాల ప్రజలకు మసీదు ప్రవేశం అందుబాటులో ఉంచేలా నిర్ణయించారు.
హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మకమైన మక్కా మసీదుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో మక్కా మసీదు కీలక పాత్ర పోషించింది. అదే విధంగా కోఠిలోని నివాసంపై జరిగిన దాడిలో తుర్రేబాజ్ ఖాన్‌తో పాటు మక్కా మసీదుకు చెందిన మౌల్వీ అల్లావుద్దీన్ బ్రిటిష్ వారిపై సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించి ప్రముఖ పాత్ర వహించారు. అయితే పరాయి పాలనకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో తుర్రేబాజ్ ఖాన్ హైదరాబాద్‌లోని దీప స్తంభానికి ఉరి వేయబడగా, మౌల్వీ అల్లాద్దీన్ అండమాన్ దీవుల్లోని జైలులో రెండు దశాబ్దాలకుపైగా శిక్ష అనుభవించాడు. దీంతో హైదరాబాద్ ప్రాంతం నుండి అండమాన్‌లో ఖైదు చేయబడిన మొదటి భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడిగా మౌల్వీ అల్లాద్దీన్‌ను చెప్పవచ్చు. కాగా, శిక్ష అనుభవిస్తున్న కాలంలోనే మౌల్వీ మరణించాడు. ఈ విధంగా దేశం కోసం ఈ ఇద్దరు తమ ప్రాణాలను అర్పించి మహనీయులయ్యారు.
‘Visit My Masjid’ పేరుతో ఇలా మసీదుల్లోకి ఇతర మతాల ప్రజలను కూడా ఆహ్వానించడం ద్వారా మసీదులు ఎలా ఉంటాయి.. మతం పట్ల నమ్మకం ఎలా ఉంటుందనేది అందరికీ తెలియడంతో పాటుగా మనుషుల్లో సర్వమత సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుందని మస్జిద్-ఎ-మదీనాకు చెందిన మొహ్సిన్ అలీ తెలిపారు. దీని ద్వారా అన్ని మతాల వారిలో సేవాభావం, సోదరభావం ఏర్పడి అన్ని మతాలు ఒక్కటేనని, అందరం భారతీయులమనే భావన కలుగుతుందని ఆయన అన్నారు. విద్యావేత్త జాకీర్ హుస్సేన్ ఇందుకు సంబంధించిన విశ్లేషణ ఇస్తూ.. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మైనార్టీలు దేశంలో ఎంతగా పోరాడారో ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరికీ తెలిపే ప్రయత్నం జరుగుతుందన్నారు.
నిజాం ఆధ్వర్యంలోని హైదరాబాద్ సంస్థానం బ్రిటిష్ వారి మిత్రదేశంగా ఉన్నప్పటికీ.. చాలామంది మత పెద్దలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. వారు ఒకవైపు నిజాం.. మరోవైపు బ్రిటిష్ వారి తరపున రెండు వైపులా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. మునావర్ హుస్సేన్ అనే సంఘ సంస్కర్త ‘Visit My Masjid’ అనే ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా ఎంతో విజయవంతంగా నిర్వహించబడ్డాయని అన్నారు. దేశాన్ని ఒక్క తాటిపై నడిపే ఇలాంటి కార్యక్రమాలతో అన్ని మతాల ప్రజల్లో సోదరభావం వెల్లివిరవడమే కాకుండా నగరంలో మత కల్లోలాలు జరగకుండా కలిసిమెలసి ఉండేలా ఐకమత్యం అలవడుతుందని, ఇది ఎంతో మంచి పరిణామమని అన్నారు.