ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మొదలుకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. 14వ తేదీన పద్దును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ 2026-27ను రూపొందించే పనిలో ఉండగా…. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా కసరత్తు పూర్తి చేసే పనిలో ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.


ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 10 గంటలకు గవర్నర్ రాష్ట్ర శాసనసభ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ్యులు ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజంతా ఈ తీర్మానంపై చర్చ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 14వ తేదీన బడ్జెట్ ను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మాదిరిగానే 2026-27 బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టనుంది. ఆ రోజు ఆదివారమైనా లోక్‌సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను సభకు సమర్పిస్తారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆధారంగా పలు అంశాలపై కసరత్తు చేసే అవకాశం ఉంటుంది. ఏపీకి కేటాయించిన నిధులు, రాబోయే నిధులపై ఓ అంచనాకు వస్తుంది. దీని ఆధారంగా… కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా భాగం చేసుకునేలా పద్దును రూపకల్పన చేసే అవకాశం ఉంటుంది.

రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేబినెట్ భేటీల్లో చాలా నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది. వీటిల్లో కొన్నింటికి శాసనసభ ఆమోదం తప్పనిసరి. అంతేకాకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, నిధుల కేటాయింపుతో పాటు అభివృద్ధి అంశాలపై విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇక పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణంపై కూడా కీలకంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.