ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య.. అసలు విషయం తెలిసి పోలీసులే షాక్..!

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉపాద్యాయుడి హత్య సంచలనం రేపుతోంది. జూన్ 12వ తేదీన పాఠశాల పునః ప్రారంభం అవడంతో విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన ఉపాద్యాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు.


ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న జిల్లా పోలీసులు.. తమదైన స్టైల్ లో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఉపాద్యాయుడి హత్యలో భార్యే నిందితురాలని గుర్తించారు పోలీసులు. వివాహేతర సంబందానికి అడ్డొస్తున్నాడని, ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు సుపారీ మర్డర్‌కు ఫ్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురుని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్, జైనథ్ మండలం మేడిగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. స్కూల్ పునః ప్రారంభం అవడంతో స్వగ్రామం నార్నూర్ మండలం నాగులకోయ నుండి జూన్ 12న ఉదయం 7:30 గంటలకు పాఠశాలకు బయలు దేరాడు.. గాదిగూడ మండలం లొకారి శివారు ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు అతడిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన గజానంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీన్ కట్ చేస్తే ఉపాద్యాయుడి హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గజానంద్ మృతికి కర్తకర్మక్రియ భార్య విజయలక్ష్మి అని తేల్చేశారు. విజయ లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

రాథోడ్ రమేష్ అనే యువకుడితో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది గజానంద్ భార్య విజయలక్ష్మి. భర్తకు వీరి అనైతిక సంబంధం విషయం తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. విజయలక్ష్మి ప్రియుడితో కలిసి భర్త గజానంద్ హత్యకు స్కెచ్ వేసింది. సుపారీ గ్యాంగ్ ను సంప్రదించి భర్త గజానంద్ ను ఫ్లాన్ ప్రకారం హత్య చేయాలని సూచించింది. అందుకు తగ్గట్టుగానే సుపారీ గ్యాంగ్ కు డబ్బులు ముట్టడంతో గజానంద్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించింది ముఠా. పాఠశాలలు రీ ఓపెన్ కావడంతో ప్రభుత్వ ఉపాద్యాయుడైన గజానంద్ పాఠశాలకు వెళుతున్నాడని తెలుసుకుని అతడిని ఫాలో అయింది. పక్కా ఫ్లాన్ ప్రకారం దాడి చేసి హతమార్చిన ముఠా సభ్యులు గజానంద్ చనిపోయాడని తెలుసుకుని ఘటన స్థలం నుండి పారిపోయింది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. కాల్ డాటా ఆధారంగా విజయలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించడంతో సుపారీ హత్య విషయం బయటపడింది. ప్రియుడిని వదులుకోలేక భార్యను హతమార్చేందుకు మున్నా అనే సుపారీ గ్యాంగ్ సాయంతో గజానంద్‌ను విజయలక్ష్మి మర్డర్ చేయించినట్టుగా తేలింది.