ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్త ఆధార్ యాప్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది.
బుధవారం ఢిల్లీలో డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ యాప్‌ను లాంచ్ చేశారు. 2009లో జనవరి 28న ఇదే రోజున ఆధార్ వ్యవస్థను ప్రవేశపెట్టగా.. అదే రోజు ఈ కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేయడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సహాయమంత్రి జితిన్ కూడా పాల్గొన్నారు. ఈ యాప్ ఆధార్ సేవలు వినియోగదారులు సులువుగా పొందటంతో ఎంతో ఉపయోగపడనుంది. దీంతో ఆధార్ సంస్కరణల్లో ఇదొక కీలక పరిణామంగా చెబుతున్నారు. ఈ కొత్త యాప్‌తో ఆన్‌లైన్ ద్వారా సులువుగా ఇంటి వద్ద నుంచే సేవలు పొందవచ్చు.
ఆధార్ యాప్ ప్రత్యేకతలు ఇవే..
-ఆధార్ కార్డులోని వివరాలను సులువుగా అప్‌డేట్ చేసుకోవచ్చు
-మొబైల్ నెంబర్, అడ్రస్ వంటివి మరింత ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు
-మీ కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను ఒకేచోట ఉంచుకోవచ్చు. దీంతో ఎప్పుడైనా అవసరమైన సమయంలో సులువుగా షేర్ చేయొచ్చు. ఐదుగురి సభ్యుల వరకు ఆధార్ వివరాలను భద్రపర్చుకోవచ్చు
-ఎక్కడైనా హోటల్ లేదా ఇతర అవసరాలకు ఆధార్ ధృవీకరణ డిజిటల్‌గా పూర్తి చేయొచ్చు
-ఆధార్ వెరిఫికేషన్‌కు అవసరమైన వివరాలు మాత్రమే షేర్ చేయొచ్చు
-ఆధార్‌ను సురక్షితంగా, యూజర్ ఫ్ల్రెండీగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది
-క్యూఆర్ ఆధారిత ధృవీకరణ
ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
-మీ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లండి
-ఆధార్ అని సెర్చ్ చేయండి
-ఆధార్ అనే పేరుతో ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
-మీ మొబైల్ నెంబర్‌తో యాప్‌లోకి లాగిన్ అవ్వండి
-మీకు కావాల్సిన సేవలను ఎంచుకుని ఉపయోగించుకోవచ్చు
ఆధార్ యాప్ కొత్త వెర్షన్
ఆధార్ యాప్‌ను గత ఏడాదిలోనే విడుదల చేయగా.. ఇప్పుడు పూర్తి స్థాయి వెర్షన్‌ను యూఐడీఏఐ విడుదల చేసింది. ఈ వెర్షన్‌లో ఫీచర్లను జోడించింది. దీని వల్ల ఎక్కడైనా ఆధార్ కార్డు ధృవీకరణ అవసరమైతే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. దీంతో పేపర్ లెస్ ఆధార్ ధృవీకరణ అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి ఆధార్ ధృవీకరణ కోసం జిరాక్స్ కాపీలను అందించాల్సిన అవసరం ఉండదు. జిరాక్స్ కాపీలను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు యూఐడీఏఐ ఈ కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.































