చియా సీడ్స్, పెరుగు కాంబినేషన్.. మీ జీర్ణక్రియను మెరుగుపరిచే సులభమైన మార్గం

గట్ హెల్త్ లేదా జీర్ణవ్యవస్థ ఆరోగ్యం గురించి నేడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ‘చియా సీడ్స్’ సూపర్ ఫుడ్‌గా ప్రాచుర్యం పొందాయి.


అయితే.. వీటిని నీళ్లలో కలిపి తీసుకోవడం కంటే పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల మీ పొట్టకు ‘బంగారం’లాంటి ఫలితాలు అందుతాయని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ NHS సర్జన్ డాక్టర్ కరణ్ రాజన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలుఇప్పుడు తెలుసుకుందాం.

చియా సీడ్స్, పెరుగు: ఒక అద్భుతమైన కాంబినేషన్:

సాధారణంగా చాలామంది చియా సీడ్స్‌ను రాత్రంతా నీళ్లలో.. నానబెట్టి ఉదయాన్నే తాగుతుంటారు. కానీ.. డాక్టర్ రాజన్ అభిప్రాయం ప్రకారం.. చియా సీడ్స్‌ను పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అందే పోషకాలు రెట్టింపు అవుతాయి. దీనిని ఆయన “జీర్ణవ్యవస్థకు గోల్డ్ డస్ట్” అని అభివర్ణించారు.

పెరుగుతో తీసుకుంటే కలిగే లాభాలు ఏంటి ?

ప్రీబయోటిక్స్ , ప్రోబయోటిక్స్ : చియా సీడ్స్‌లో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. పెరుగులో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ప్రోబయోటిక్‌గా పనిచేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు.. మీ పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారం అందడమే కాకుండా.. కొత్త బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

మెరుగైన పోషకాల శోషణ: చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. పెరుగులో ఉండే కొవ్వు పదార్థాలు ఈ ఒమేగా-3 యాసిడ్లను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తాయి. నీళ్లలో కలిపి తీసుకున్నప్పుడు ఈ స్థాయి శోషణ జరగదు.

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ: పెరుగులోని ప్రోటీన్ , చియా సీడ్స్‌లోని ఫైబర్ కలిసి రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి చాలా మేలు చేస్తుంది.

జీర్ణక్రియకు ఎలా తోడ్పడుతుంది ?

చియా సీడ్స్ తమ బరువు కంటే 10 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకోగలవు. ఇవి పెరుగుతో కలిసినప్పుడు ఒక జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఇది పేగుల గుండా ఆహారం సులభంగా కదలడానికి సహాయపడుతుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. అలాగే.. ఇది మీ పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచి, అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది.

ఎలా తీసుకోవాలి ?

ఒక కప్పు గడ్డ పెరుగును తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కలపండి. ఈ మిశ్రమాన్ని కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. రుచి కోసం అందులో తాజా పండ్లు లేదా కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.

ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ మొత్తం శరీర ఆరోగ్యానికి పునాది. కేవలం నీళ్లతో చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ అందుతుంది. కానీ పెరుగుతో కలిపి తీసుకున్నప్పుడు అది ఒక సంపూర్ణ ‘గట్ హెల్త్ బూస్టర్’గా మారుతుంది. మీ దైనందిన ఆహారంలో ఈ చిన్న మార్పు చేసుకోవడం ద్వారా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.