Roof Garden Farming: క్రిమి సంహారక మందుల వలన కలిగే దుష్ప్రభావాలను గమనించిన ఓ డాక్టర్ దంపతులు తమకున్న ఇంటి పైకప్పుపై సేంద్రియ పద్దతిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా మిద్దె సాగు చేస్తూ రకరకాల కూరగాయలు, పండ్లు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు . 800 ల మొక్కలను మిద్దెపై సాగు చేస్తున్నారు.
ఆరోగ్యకర జీవితానికి ఆరోగ్యకర ఆహారం అత్యవసర . కానీ ప్రస్తుత కాలంలో నిత్యం ఉపయోగించే ఆహార పదార్ధాలు, కూరగాయలు,పండ్లు మొదలగు వాటిపై రసాయనాల వాడకం విపరీతంగా పెరిగింది. వీటిని తినడం వలన ప్రజలు అనేక అనారోగ్యలా బారిన పడుతున్నారు.
రసాయనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో సేంద్రియ ఇంటి పంటలు, లేదా టెర్రస్ గార్డెనింగ్ (మిద్దె తోటల సాగు ) వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రిమి సంహారక మందుల వలన కలిగే దుష్ప్రభావాలను గమనించిన ఓ డాక్టర్ దంపతులు తమకున్న ఇంటి పైకప్పుపై సేంద్రియ పద్దతిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా మిద్దె సాగు చేస్తూ రకరకాల కూరగాయలు, పండ్లు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు .సుమారు 700 ల నుండి 800 ల వరకు మొక్కలను మిద్దేసాగుతో ఎంతమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు ఈ డాక్టర్ దంపతులు.
ఎనిమిది సంవత్సరాల క్రితం మొదలు….
సిద్దిపేటలోని అభిరామ్ డెంటల్ ఆసుపత్రి నడుపుతున్న ప్రసిద్ధ దంత వైద్యుడు డాక్టర్ డిఎన్. స్వామి, అతని భార్య డాక్టర్ శ్రీదేవి సిద్దిపేటలోని కంచర బజార్ లో నివసిస్తున్నారు. దంత వైద్యుడిగా సేవలందిస్తూనే, భార్య సహకారంతో 2,000 చదరపు అడుగుల ఇంటి టెర్రస్ పై ఎనిమిది సంవత్సరాల క్రితం సొంతంగా మిద్దె తోటను పెంచడం ప్రారంభించారు డాక్టర్ స్వామి.
ఈ దంపతులు ఆకుకూరలతో పాటు 15 రకాల కూరగాయల మొక్కలు, 10 రకాల పండ్ల మొక్కలు, 15 రకాల హెర్బల్ మొక్కలతో కలిపి మొత్తం 800 ల రకాల మొక్కలను మిద్దె తోటలో పెంచుతున్నారు.
సేంద్రియ పద్దతిలో పెంపకం….
ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా సేంద్రియ పద్దతిలో వారు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇంటి అవసరాలకు సరిపోవడంతో పాటు, ఇంకా మిగులు దిగుబడి వస్తుండటంతో తమ స్నేహితులు, బంధువులతో కూడా ప్రతిరోజు పంచుకుంటున్నారు.
ఈ డాక్టర్ దంపతుల టెర్రస్ గార్డెన్ చాల మందికి స్ఫూర్తినిచ్చించి. ఇప్పుడు వీరితో పాటు, చుట్టుపక్కల 10 మందికి పైగా డాబాలపై ఇలాంటి తోటలను విజయ వంతంగా పెంచుతున్నారు. ఇంకా చాలా మంది మిద్దె తోటను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.
వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి…
డాక్టర్ స్వామి మాట్లాడుతూ మార్కెట్ లో విక్రయిస్తున్న పురుగు మందులు కలిపిన పండ్లు, కూరగాయల వల్ల కలిగే ద్రుష్పరిణామాలను గుర్తించి సొంతంగా కూరగాయలు, పండ్లు పండించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు తమ తోట నుండి ఎక్కువ మొత్తంలో పంటను పండిస్తున్నామన్నారు.
వీరి గార్డెన్ ను చూసిన స్నేహితులు, ఇరుగు పొరుగు వారు చాలా మంది ఈ మిద్దె తోటను పెంచడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాంటి వారి కోసం సిద్దిపేట పట్టణంలో ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పరుచుకొని, దాని ద్వారా కొత్తగా మిద్దె తోటలు పెంచేవారి సందేహాలను నివృత్తి చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఒత్తిడి తగ్గతుంది…
ఈ తోటలో పని చేయడం ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుందని డాక్టర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం ఈ తోటలో ఎక్కువసేపు గడుపుతామని, అక్కడ తమకు తాజా ఆక్సిజన్ లభిస్తుందని ఈ దంపతులు చెప్పారు. సేంద్రియ పద్దతిలో పండించిన కూరగాయలు, పండ్లు తినడం వలన ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు.