ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు(Videos) సామాజిక మాధ్యమా(Social Media)ల్లో వైరల్ అవుతుండటం గమనిస్తూనే ఉన్నాం. జంతువులు, పక్షులు చేసే చేష్టలు కొందరు నెటిజన్లు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఆ వీడియోలు చూస్తే ఆశ్చర్యకరంగా, షాకింగ్ గానూ ఉంటాయి. ఇక ఇటీవల అడవిలో ఉండాల్సిన జంతువులు సమీప గ్రామాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇళ్లలోకి ప్రవేశించి హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
అది ఏంటంటే.. ఉత్తరాఖండ్(Uttarkhand)లోని హరిద్వార్ సమీపంలో ఓ ఏనుగు(elephant) అడవిలో నుంచి నేరుగా సంతలోకి ప్రవేశించింది. గ్రామంలో ప్రతి వారానికి ఒక రోజు ఏర్పాటు చేసే అంగడిలో ఎన్నో రకాల ఐటమ్స్ ఉన్నాయి. జనాలు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. కానీ.. ఏనుగు దర్జాగా సంతలోకి వెళ్లి.. రోడ్డు పక్కన పెట్టిన గోధుమ బస్తాలలో నుంచి ఓ బస్తాను తొండంతో పట్టుకుంది. ఈ క్రమంలో గోధుమ బస్తా పగిలిపోయి పిండి బయటపడడంతో తొండంతో తీసుకుని తినేసింది.
అయితే.. సందడిగా కొనసాగుతున్న సంతలోకి ఒక్కసారిగా గజేంద్రుడు రావడంతో అక్కడ ఉన్నవారు భయాందోళనకు(Panic) గురయ్యారు. కానీ ఆ ఏనుగు ఎవరికీ ఎలాంటి హాని కలిగించలేదు. సంతలో బీభత్సం కూడా చేయలేదు. కేవలం గోధుమ పిండి తినేసి తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ తరుణంలో గ్రామస్థులు ఏనుగు గోధుమ పిండి తినడం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను మొత్తం సంతలో ఉన్న కొందరు తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించి.. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్(Viral) గా మారింది. హరిద్వార్ సమీపంలోని బహద్రాబాద్ పక్కనే రాజాజీ టైగర్ రిజర్వ్ ఉన్న విషయం తెలిసిందే.



































