ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. మరో ఇరువై రోజుల్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారనే టాక్‌తో… కూటమిలో సందడి వాతావరణం కనిపిస్తోంది.
వందల్లో పదవులుంటే వేలల్లో పోటీ ఉండటంతో… ఇటు ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో అసలు ఈక్వెషన్స్ ఎలా ఉండబోతున్నాయ్…? కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఎంత ప్రాధాన్యత అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన త్యాగరాజులకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు డిజైడ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ కోసం కష్టపడిన వాళ్లు, వ్యక్తిత్వం ఉన్న వాళ్లే క్రైటీరియాగా ముందుకెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశతో గత ఐదేళ్లుగా నియోజకవర్గాల్లో కష్టపడిన నేతలు ఎందరో చివరి నిమిషంలో అధినేత నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు వారందరూ సీఎం వైపే ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు…మరిచిపోవద్దంటూ వినతి పత్రాలను సైతం అందజేస్తున్నారు.
ఇటు జనసేన సైతం నామినేటెడ్ పోస్టులపై ఆశగా చూస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా… బిజెపి,టీడీపీలతో పొత్తుకట్టిన జనసేన… సీట్ల సర్దుబాటులో ఎవరూ ఊహించని త్యాగాలకు సిద్ధపడింది. 175 స్థానాల్లో కేవలం 21 ఎమ్మెల్యే సీట్లు… 25 ఎంపీ సీట్లలో కేవలం 2 స్థానాలు.. తీసుకుని, మిగితా చోట్ల కూటమి విజయానికి కృషిచేసింది. అంతేకాదు, హండ్రెడ్ పర్సంట్ స్ట్రయిక్ రేటుతో విజయం సాధించి, కూటమిలో తానెంత కీలకంగా వ్యవహరించానో కూడా చాటిచెప్పింది పవన్ పార్టీ. దీంతో జనసేన కూడా కాస్త ఎక్కువగానే నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్య పవన్ నామినేటెడ్ పోస్టులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పదవులు రాకపోయినా కష్టానికి, త్యాగానికి పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. పదవులు ఇవ్వలేకపోయినా… గుండెల్లో ఉంటారని జనసేన నేతలను ఉద్దేశించి అన్నారు పవన్.
మరోవైపు బీజేపీ సైతం ఏమాత్రం తగ్గట్లేదు. తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ రేసులోకొచ్చింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కమలదళం… నామినేటెడ్ పోస్టుల ద్వారా పార్టీ విస్తరణ మరింత వేగవంతమవుతుందని భావిస్తోంది. భవిష్యత్ నాయకులని తీర్చిదిద్దుకోవడానికి ఇదే మంచి అవకాశమనుకుంటోంది. అందుకే, పదవుల పంపకంలో తమకూ ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. ఏపీ బీజేపీ పెద్దలు ఇదే విషయంపై సీఎం చంద్రబాబును నెలలో రెండు సార్లు కలవడం చర్చనీయాంశమైంది.
మొత్తంగా… నామినేటెడ్ పోస్టుల భర్తీ కూటమి ప్రభుత్వానికి పెద్ద టాస్క్‌గా మారితే… ఆశావాహుల్లో అంతకంతకూ టెన్షన్ పెరుగుతోంది. మరి నామినేటెడ్ పదవుల్లో ఏ పార్టీకి ఎన్ని పదవులు దక్కనున్నాయి…? పదవులు దక్కించుకోనున్న ఆ అదృష్టవంతులు ఎవరనేది తెలియాలంటే ఓ 20 రోజులు ఆగాల్సిందే మరి…!