Highest Temperature: ఈసారి ఎండాకాలం మామూలుగా లేదు. మాడు పగిలే ఎండలతో దేశ చరిత్రలోని రోజురోజుకూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి. మొదట రాజస్థాన్‍లోని ఫలోడీలో ఏకంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఇది జరిగిన కొన్ని రోజులకే దేశ రాజధాని ఢిల్లీలోని ముంగేష్ పూర్‌లో ఏకంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. భారతదేశ చరిత్రలోనే అత్యంత అధిక ఉష్ణోగ్రతగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఈ రికార్డును రెండు రోజుల్లోనే చెరిపేసింది. మన దేశ చరిత్రలో ఇప్పటివరకు నమోదు కాని విధంగా ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. సంచలనం సృష్టించింది. ఈ ఎండకు నాగ్‌పూర్ వాసులు తట్టుకోలేకపోయారు.
భారత వాతావరణ విభాగం.. నాగ్‌పుర్‌లో 4 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఆ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్‌లో రెండింట్లో గురువారం అసాధారణ ఉష్ణోగ్రతలు చూపించడం సంచలనంగా మారింది. సోనేగావ్‌లోని ఏడబ్ల్యూఎస్ స్టేషన్‌లో ఏకంగా 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీలు నమోదైంది. మిగతా రెండు స్టేషన్లలో 44 డిగ్రీల ఎండలు ఉన్నట్లు రికార్డు అయింది.
ఇక ఇటీవల ఢిల్లీలోని ముంగేష్‌పుర్‌లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది దేశ చరిత్రలో అత్యధికం కావడంతో వాతావరణ శాఖ స్పందించింది. ఆ వాతావరణ స్టేషన్‌లోని సెన్సార్ సరిగా పనిచేస్తుందో లేదో తనిఖీ చేస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా నాగ్‌పుర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం మరోసారి చర్చకు దారితీసింది. దీంతో సెన్సార్ పనితీరుపై మరోసారి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే వడదెబ్బ కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 24 గంటల వ్యవధిలోనే 54 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా బీహార్‌లో 32 మంది చనిపోగా.. ఆ తర్వాత ఒడిషాలో 10 మంది, జార్ఖండ్‌లో ఐదుగురు, రాజస్థాన్‌లో ఐదుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు, ఢిల్లీలో ఒకరు మరణించారు. ఇక రానున్న రెండు రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము తుపాను వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన వడగాలులు ఉన్నందున దేశంలో జాతీయ ఎమర్జెన్సీని విధించే అవకాశాలను పరిశీలించాలని రాజస్థాన్ హైకోర్టు కేంద్రానికి సూచించింది.
మరోవైపు దేశంలోకి కాస్త ముందుగానే ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. గురువారం కేరళ తీరాన్ని తాకిన ఈ నైరుతి రుతుపవనాలు.. ప్రస్తుతం దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో దేశం మొత్తం విస్తరించే అవకాశం ఉండటంతో శనివారం నుంచి వడగాలుల తీవ్రత కాస్త తగ్గొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.