భార్యను ప్రియుడికిచ్చి పెళ్లిచేసిన భర్త.. ఆ తర్వాత ఏమైందంటే?

ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన భార్య మరో వ్యక్తిని ప్రేమించి, అతడితోనే ఉంటానని చెప్పడంతో భర్త.. వారిద్దరికీ పెళ్లి జరిపించారు.


అంతేకాకుండా.. తమ ఇద్దరు పిల్లలను తానే పోషిస్తానని సదరు భర్త చెప్పుకొచ్చారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. యూపీలోని సంత్ కబీర్‌నగర్‌ గ్రామానికి చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన రాధికను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, బబ్లూ జీవనోపాధి మరోచోట పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రాధిక.. అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది. ఈ సంబంధం క్రమంగా గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం భర్త బబ్లూకు కూడా తెలిసింది. దీంతో, భార్యను మందలించాడు. తీరు మార్చుకోవాలని సూచించాడు. అయితే, ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో బబ్లూ.. నా భార్య నాతో జీవించాలా లేక తన ప్రేమికుడితో జీవించాలా అని నిర్ణయించుకుంటుందా? అని గ్రామస్తుల ముందు పంచాయితీ పెట్టాడు. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి జీవించాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు మొత్తం సమాజం నివ్వెరపోయింది.

భార్య ప్రవర్తన కారణంగా చేసేదేమీ లేకపోవడంతో.. ముందుగా భర్త తన భార్యతో కలిసి నోటరీ పబ్లిక్‌ కోర్టుకు హాజరయ్యాడు. ఆపై తన భార్యను ఆమె ప్రియుడితో ఒక ఆలయంలో రెండో వివాహం చేశాడు. తానే దగ్గరుండి ఆమె ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి జరిపించాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇక మొదటి భర్త తన భార్యతో కలిగిన సంతానాన్ని తనతోనే పోషిస్తానని చెప్పాడు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.