స్టాగ్ బీటిల్.. దీన్ని పేడ పురుగు అంటారు. చెత్త చెదారం ఉన్న చోట పెరుగుతుంది. ఇలాంటి పురుగు మన ఇంట్లో తిరిగితే ఏ దోమల బ్యాటో పుచ్చుకుని కొట్టి చంపేస్తాం. కానీ జపాన్ వాళ్ళు మాత్రం అలా కాదు. ఇలాంటి పురుగుని తెచ్చి ఇస్తే లక్షలు పెట్టి కొంటారు. బీఎండబ్ల్యూ, ఆడి కార్లతో సమానంగా వీటిని ట్రీట్ చేస్తారు. అంతలా ఈ పేడ పురుగులకు ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏంటి? అసలు ఇందులో ఏముంది అంత గొప్ప?
ఈ స్టాగ్ బీటిల్ ఇంట్లో ఉంటే అదృష్టం, సంపద కలిసి వస్తాయని నమ్ముతారు. అలానే ఈ స్టాగ్ బీటిల్ ఆయిల్ ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని నమ్ముతారు. ఒక మగ పేడ పురుగు 4 సెంటీమీటర్ల నుండి 9 సెంటీమీటర్ల పొడవు వరకూ పెరిగితే.. ఆడ పేడ పురుగు 3 సెంటీమీటర్ల నుంచి 4 సెంటీమీటర్ల పొడవు వరకూ పెరుగుతుంది. వీటి జీవిత కాలం మూడు నుంచి ఏడు సంవత్సరాలు ఉంటుంది. వీటిలో మొత్తం 1200 రకాల జాతులు ఉన్నాయి. ఇవి రెండు పొడవైన కొమ్ములను కలిగి ఉంటాయి. చూడ్డానికి ఒక సైనికుడు ధరించిన ఆయుధంలా ఉంటాయి. ఈ పురుగులను తలకు ధరిస్తే చెడు ప్రభావాలు, నెగిటివ్ ఎనర్జీ వంటి వాటిని దరిచేరనీయకుండా రక్షిస్తుందని నమ్ముతారు.
మూర్ఛ, తిమ్మిరి, నొప్పులు, తలనొప్పి, నాడీ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుందని నమ్ముతారు. కొన్నేళ్ల క్రితం కూడా జపాన్ లో ఒక స్టాగ్ బీటిల్ లక్షల రూపాయలు పలికింది. అక్కడ ఈ పురుగులు చాలా వరకూ అంతరించిపోయాయి. ఎక్కువగా కనిపించవు. అరుదైన జాతిగా పరిగణించబడుతున్నాయి. ఇవి ఉంటే అదృష్టంగా, శుభసూచకంగా భావిస్తారు. అందుకే ఎంత ధర ఉన్నా వీటిని కొనేందుకు ముందుకు వస్తారు. వ్యాపారస్తులు కూడా వీటిని ప్రత్యేకంగా పెంచి డబ్బులు సంపాదించుకోవాలని చూస్తారు. ఈ డిమాండ్ ఒక్కోసారి బీఎండబ్ల్యూ, ఆడి కార్ల ధరలను బీట్ చేస్తాయని కూడా అనేక కథనాలు వచ్చాయి. మొత్తానికి పేడ పురుగు అని తీసి పడేస్తున్నాం గానీ దీన్ని లక్షలు పెట్టి మరీ కొంటారంటే ఆశ్చర్యంగానే ఉంది. దీని మీద నెటిజన్స్ కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మన దేశంలో కూడా ఇలాంటి పేడ పురుగులు ఉన్నాయి కాబట్టి వాటిని ఆ జపాన్ దేశానికి ఎగుమతి చేస్తే బోలెడన్ని బీఎండబ్ల్యూ కార్లు, ఆడి కార్లు కొనుక్కోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.