ఒకప్పుడు భారత్‌ను కేవలం తక్కువ ఖర్చుతో సేవలు అందించే కేంద్రంగా మాత్రమే చూసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మల్టీనేషనల్ కంపెనీలకు (MNCs) చెందిన గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCC) భారతదేశాన్ని తమ వ్యూహాత్మక కేంద్ర బిందువుగా మార్చుకున్నాయి.
ఈ GCCలు కేవలం సర్వీస్ సెంటర్ లు కావు.. ఇవి ఇప్పుడు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక రంగాలకు ఇన్నోవేషన్ హబ్‌లుగా రూపాంతరం చెందుతున్నాయి.
ఉద్యోగాల సృష్టిలో కొత్త ఇంజిన్
భారతీయ టెక్ జాబ్ మార్కెట్‌లో ప్రస్తుతం గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ కీలకమైన గ్రోత్ ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి. వీటి వృద్ధి వేగం ఏ స్థాయిలో ఉందో ఈ లెక్కలే చెబుతున్నాయి..
- వేగవంతమైన నియామకాలు: ఐటీ సంస్థల కంటే GCCలు నాలుగు రెట్లు వేగంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. GCC నియామకాలు ఏటా 18-27 శాతం చొప్పున పెరుగుతున్నాయి. ఐటీ రంగంలో ఈ సంఖ్య 4-6 శాతానికే పరిమితమైంది.
- పెరిగిన ఉపాధి: రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ సెంటర్‌లు ఇప్పుడు దేశంలో 1,600 పైగా ఉన్నాయి. 2022లో 1.2 మిలియన్లుగా ఉన్న నిపుణుల సంఖ్య ఇప్పుడు దాదాపు 2 మిలియన్లకు చేరింది.
భవిష్యత్ లక్ష్యం ఇదే..
2030 నాటికి దేశంలో 2,400 GCC కేంద్రాలు ఆవిర్భవించి, వాటి మార్కెట్ విలువ 110 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.9.1 లక్షల కోట్లకు) చేరుతుందని అంచనా. ప్రతి ఏటా 1.5 మిలియన్ల ఇంజినీర్లు జాబ్ మార్కెట్‌లో అడుగుపెడుతున్న తరుణంలో.. AI, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో నెలకొన్న విపరీతమైన డిమాండ్‌ను గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ సమర్థంగా తీరుస్తున్నాయి. అంతేకాదు, ఈ సెంటర్స్ లో ఉండే ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉంది. కొన్ని చోట్ల ఐటీ జాబ్స్ కంటే ఎక్కువ శాలరీలు ఉంటున్నాయి.
అన్ని రంగాలకు ఇదే ఆధారం..
గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ అంటే కేవలం తక్కువ ఖర్చుతో కూడిన సేవా కేంద్రాలు అనే పాత భావన ఇప్పుడు పూర్తిగా పోయింది. ఇవి ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలకు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటివి. క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ వంటి వినూత్న అంశాలపై దృష్టి సారిస్తున్నాయి. AI ఆధారిత కాంట్రాక్ట్ నిర్వహణ, ఖర్చు ఆప్టిమైజేషన్ కోసం ప్రిడిక్టివ్ అనలిటిక్స్‌ను ఉపయోగిస్తూ ప్రొక్యూర్-టు-పే (P2P) ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి.
ఈ విధంగా గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ కేవలం ఐటీ రంగానికి మాత్రమే కాకుండా, ఫైనాన్స్, సప్లై చైన్, కస్టమర్ సర్వీస్ వంటి అన్ని రంగాల్లోనూ ప్రపంచ వ్యాపార వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల కల్పనతో పాటు జీతాల రేంజ్ ను కూడా మారుస్తున్నాయి. నాస్కామ్ అంచనా ప్రకారం.. 2026 నాటికి 300 బిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచ టెక్ రంగంలో భారత్ ఒక పవర్‌హౌస్‌గా నిలబడబోతోంది. ఈ ప్రయాణంలో GCCల పాత్ర చాలా కీలకం.


































