స్మశానంలా లాస్ ఏంజల్స్.. ఇంద్ర భవనాల్లాంటి 12 వేల ఇళ్లు మటాష్.. నష్టం 15 లక్షల కోట్ల పైమాటే..

www.mannamweb.com


కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లాస్ ఏంజల్స్ నగరాన్ని కార్చిచ్చు సర్వ నాశనం చేసింది. ఇంకా ఆ రాకాసి మంటలు చల్లారలేదు. కార్చిచ్చు ముప్పు పొంచి ఉండటంతో లక్షా 50 వేల ఇళ్లలో ఉంటున్న ప్రజలను ఖాళీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది.

21,317 ఎకరాల్లో ఉన్న ఇళ్లు, వ్యాపార సంస్థలు వైల్డ్ ఫైర్ కారణంగా తగలబడిపోయాయి. 12 వేలకు పైగా ఇళ్లు, పెద్దపెద్ద భవంతులు, హాలీవుడ్ సెలబ్రెటీల విలాస భవనాలు అగ్నికి ఆహుతైపోయాయి. 11 మంది ఇప్పటికే ఈ ఊహించని విపత్తు కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

కార్చిచ్చు అంటుకుని నాలుగు రోజులు దాటినా, ఆ మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఎక్కడో ఒక దగ్గర ఇప్పటికీ మంటలు దహించివేస్తూనే ఉన్నాయి. లాస్ ఏంజెల్స్ నగరం తగలబడిన విజువల్స్ సోషల్ మీడియాను విస్మయానికి గురిచేస్తున్నాయి. యుద్ధంలో, బాంబు దాడుల్లో ఒక నగరం తుడిచిపెట్టుకుపోతే ఆ తదనంతరం ఆ నగరం స్మశానాన్ని తలపిస్తుంది. దాదాపు యుద్ధం అనంతరం కనిపించే దృశ్యాలు కార్చిచ్చు కాల్చేసిన లాస్ ఏంజెల్స్ నగరంలో కనిపిస్తున్నాయి.

లాస్ ఏంజెల్స్ నగరంపై ప్రకృతి కూడా పగబట్టినట్టు ఉంది. వరుణు దేవుడు కూడా ఈ నగరంపై కనికరం చూపలేదు. లాస్ ఏంజెల్స్ నగరంలో ఎనిమిది నెలల నుంచి వర్షాలే కురవలేదు. హోటల్స్లో పనిచేసే వెయిటర్స్ నుంచి హాలీవుడ్ స్టార్స్ దాకా సర్వం కోల్పోయి, ఇళ్లు తగలబడిపోయి, నిలువ నీడ లేక నిరాశ్రయులైపోయి నిరాశతో నడి వీధిలో నిల్చున్న దయనీయ పరిస్థితులు లాస్ ఏంజెల్స్లో ఉన్నాయి. వైల్డ్ ఫైర్ సృష్టించిన విధ్వంసం వల్ల లాస్ ఏంజెల్స్ 135 బిలియన్ డాలర్ల నుంచి 150 బిలియన్ డాలర్ల వరకూ నష్టపోయి ఉండొచ్చని AccuWeather అనే ఒక ప్రైవేట్ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వం నుంచి ఈ నష్టంపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.