జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు తప్పనిసరి తనిఖీల పేరుతో ఘరానా దోపిడీకి తెగబడుతున్నాయి. తనిఖీలు చేపట్టకుండానే, వినియోగదారులకు అవగాహన కల్పించకుండానే ముక్కుపిండి వసూలు చేసిన మొత్తానికి రశీదు చేతిలోపెట్టి మమ అనిపిస్తున్నాయి. ఈ రూపేణా ఏటా జిల్లాలో మూడుకోట్ల రూపాయలకు పైగా లూటీ చేస్తున్నాయి. మరోవైపు డోర్ డెలవరీ ముసుగులో బండపై రూ.30 నుంచి 50 రూపాయల వరకూ వసూలు చేస్తున్నాయి. ఈ విధంగానూ కోట్ల రూపాయల భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. వినియోగదారుల అవగాహన రాహిత్యం, అవసరం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బరితెగిస్తున్నాయి.
జిల్లావ్యాప్తంగా వివిధ గ్యాస్ కంపెనీలకు చెందిన 36 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 7 లక్షల 4 వేల 273 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఐదేళ్లకోసారి ఆయా గ్యాస్ ఏజెన్సీలు తప్పనిసరి తనిఖీలు పేరుతో సిబ్బందిని పంపి ఒక్కో గ్యాస్ కనెక్షన్ వినియోగదారునుంచి రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. స్టేట్, సెంట్రల్ జీఎస్టీలు కలిపి రూ.36 దీనికి అదనం. మొత్తం రూ.236 వంతున వసూలు చేస్తున్న సిబ్బంది ఆ మేరకు రశీదు ఇచ్చి వెళ్లిపోవడం తప్ప తనిఖీ ఊసే ఉండదు.
తనిఖీ చేయాల్సినవి
వినియోగదారుని చిరునామా ప్రకారం గ్యాస్ కనెక్షన్ పొందిన వారే వినియోగిస్తున్నారా, ఇతరులా అన్నది కచ్చితంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే రెగ్యులేటర్, ట్యూబ్ వ్యాలిడిటీ, స్టవ్ బర్నర్లలో లోపాలు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా స్టవ్‌ను అమర్చారా లేదా? అనే విషయాల్ని పరిశీలించడమే కాకుండా విద్యుత్ స్విచ్చుల సమీపంలో సిలిండర్లు ఏర్పాటు చేయకుండా చూడాలి. అలాగే సిలిండర్లు లీకేజీలను కూడా తనిఖీ చేసి వివరాలను యాప్‌లో నమోదు చేసి కంపెనీకి నివేదించాల్సి ఉంటుంది.
ఫ ఆయిల్ కంపెనీలు పబ్లిక్ లయబిలిటీ పాలసీ ఫర్ అయిల్ ఇండస్ట్రీస్ పేరుతో ఎల్పీజీ వినియోగదారులకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈపథకం పొందేందుకు మానవ తప్పిదం లేకుండా ఉండేలా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గ్యాస్ వినియోగదారులు తప్పనిసరి తనిఖీ చేయించుకోవాలని నిబంధన తెచ్చారు. అయితే ఈ విషయాలను వినియోగదారులకు విపులంగా వివరించాల్సిన బాధ్యతను తనిఖీ సిబ్బంది గాలికొదిలేసి డబ్బు తీసుకొని రసీదువరకు మాత్రమే పరిమితమవుతున్నారు. కనీసం ఇంట్లో గ్యాస్ స్టవ్ ముఖం కూడా చూడరు.
ఐదేళ్లకు రూ. 15 కోట్లు
జిల్లాలో 36 ఏజెన్సీలు తమ పరిధిలోని 7,04,273 గ్యాస్ కనెక్షన్ వినియోగదారుల నుంచి తప్పనిసరి తనిఖీ పేరుతో ఐదేళ్లకోసారి వసూలు చేస్తున్నది సుమారు రూ.15 కోట్లు పైమాటే. అంటే సగటున ఏడాదికి మూడు కోట్ల రూపాయలు వంతున వినియోగదారుల నుంచి వసూలు జరుగుతోంది. నిజానికి తనిఖీ సమయంలో నిబంధనలను సక్రమంగా పాటిస్తే దీనివల్ల వినియోగదారులకు మేలు జరుగుతుంది కానీ అంతా మొక్కుబడే. కేవలం డబ్బులు వసూలు కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉత్తుత్తి తనిఖీల పుణ్యమాని భవిష్యత్తులో గ్యాస్ కనెక్షన్ కారణంగా ప్రమాదం జరిగి ఆస్తి,ప్రాణనష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
అదనపు భారం
మరోవైపు రవాణా చార్జీల పేరుతో గ్యాస్ డెలవరీ సిబ్బంది ఒక్కో సిలిండర్‌పై రూ.30 నుంచి 50 రూపాయలు చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఐదు కిలోమీటర్లలోపు ఉచిత రవాణా అని చెబుతున్నా ఈ అదనపు బండ మాత్రం తప్పడం లేదు. ఏడాదికి సగటున ఐదు సిలిండర్లు విడిపిస్తే దాదాపుగా 200 రూపాయలు రవాణా చార్జీలు ముసుగులో దందా కొనసాగిస్తున్నారు.
దయ.. ప్రాప్తం
సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ పుస్తకంలో విడిపించిన తేదీ సహా ధర నమోదు, గ్యాస్ సిలిండర్ నెంబరు నమోదు చేయాల్సి ఉండగా కనీసం అది కూడా చేయడం లేదంటే ఇదెంత ప్రహసనంగా నడుస్తున్నదీ అర్థం చేసుకోవచ్చు. ఈ వివరాలు లేకపోతే ప్రమాదం జరిగితే బీమా వర్తించే అవకాశాలు తక్కువ. ప్రమాదానికి కారణమైన సిలిండర్‌ను తాము సరఫరా చేయలేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బుకాయించే అవకాశం వుంటుంది.
యంత్రాంగం ఉదాసీనత
జిల్లావ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీలు, ఆయా కంపెనీలు వినియోగదారుల జీవితాలతో ఇంత దారుణంగా ఆడుకుంటుంటే జిల్లా యంత్రాంగం ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదాలు జరిగితే తప్ప మేలుకోలేనంత మొద్దు నిద్రావస్థలో ఉన్నాయా, నిద్ర నటిస్తున్నాయా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
































