ఈ 2 ప్రభుత్వ బ్యాంకుల విలీనం.. దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకులు

భారత బ్యాంకింగ్ రంగంలో మరిన్ని భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేసిన సంగతి తెలిసిందే.


ఇప్పుడు రెండో దశ విలీనం దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు చర్చ మొదలైంది. దేశంలో అతిపెద్ద బ్యాంకులు మాత్రమే ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో రెండు పెద్ద బ్యాంకులను విలీనం చేయడం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తర్వాత దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగామార్చాలని కేంద్రం భావిస్తోందటా. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం మన దేశంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. అయితే, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే బ్యాంకులకు భారీ మూలధనం, విస్తృతమైన నెట్‌వర్క్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. వేర్వేరు బ్యాంకులు నిర్వహించడం వల్ల అయ్యే నిర్వహణ ఖర్చులను తగ్గించడం, ప్రపంచంలోని టాప్-50 బ్యాంకుల్లో మన దేశానికి చెందిన మరిన్ని బ్యాంకులు ఉండాలనేది కేంద్రం లక్ష్యంగా తెలుస్తోంది. అలాగే మొండి బకాయిల భారాన్ని తగ్గించి, రుణ పంపిణీ సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తోందటా.

ఈ రెండు బ్యాంకులు విలీనం?

తాజా నివేదికల ప్రకారం రెండు ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసే అవకాశం ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank Of India), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BoI)లను విలీనం చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు బ్యాంకులను విలీనం చేయడం ద్వారా దేశంలో ఎస్‌బీఐ తర్వాత అతిపెద్ద బ్యాంకుగా మార్చాలని భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని సోషల్ మీడియా ఎక్స్‌లో ఇండియన్ టెక్ అండ్ ఇన్‌ఫ్రా ఖాతాలో ఓ పోస్ట్ పేర్కొంది.

మరోవైపు.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులను బలమైన ఆర్థిక స్థితి కలిగిన ఇతర బ్యాంకుల్లో విలీనం చేయడం లేదా ప్రైవేటీకరించడంపై కేంద్రం కసరత్తు చేస్తోందనేవార్తలూ వస్తున్నాయి. అయితే, దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ఖాతాదారులపై ప్రభావం ఎలా ఉంటుంది?

బ్యాంకుల విలీనం జరిగినప్పుడు సాధారణ ఖాతాదారులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. విలీనం తర్వాత చెక్ బుక్స్, పాస్ బుక్స్, ఐఎఫ్ఎస్‌సి కోడ్స్ మారతాయి. యాప్‌లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్స్ మారుతాయి. ఒకే ప్రాంతంలో రెండు బ్యాంకుల బ్రాంచీలు ఉంటే, వాటిని ఒకటిగా చేసే అవకాశం ఉంటుంది.

గతంలో జరిగిన విలీనాల వల్ల బ్యాంకుల లాభదాయకత పెరిగిందని డేటా చెబుతోంది. అందుకే మరిన్ని విలీనాలు చేయడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఉద్యోగ సంఘాలు ఈ విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయి. బ్యాంకుల విలీనం అనేది ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది. ఒకవేళ మీరు ఈ పైన పేర్కొన్న బ్యాంకుల్లో ఖాతా కలిగి ఉంటే, మీ మొబైల్ నంబర్, కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసి పెట్టుకోవడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.