ఈపీఎఫ్ఓకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి.. ఆ విషయాలన్నీ సభ్యులకు తెలియాల్సిందే

www.mannamweb.com


ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) అంటే ఉద్యోగులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ మన జీతంలోని కొంత సొమ్ముతో పాటు యజమాని నుంచి సమాన వాటాను తీసుకుని పొదుపు చేస్తుంది.

ముఖ్యంగా ఉద్యోగులకు రిటైర్‌మెంట్ సమయంలో ఆర్థిక భద్రతను కల్పించడంలో ఈపీఎఫ్ఓ చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ చెల్లింపులు నెలవారీగా ఉంటాయి. అయితే ఈ చెల్లింపుల విషయాలు ఉద్యోగులకు పెద్దగా తెలియదు. ఏదైనా అవసరం వచ్చి చూసుకున్న సమయంలో చెల్లింపులు నెలవారీ జరగలేదని ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లు షాక్‌కు గురవుతూ ఉంటారు. అయితే చెల్లింపుల విషయాన్ని కచ్చితంగా సభ్యులకు ఈపీఎఫ్ఓ తెలియజేయాల్సిందేనని సంబంధిత మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓకు వచ్చిన ఆదేశాల గురించి వివరాలను తెలుసుకుందాం.

ఈపీఎఫ్ఓ సభ్యులకు తమ మినహాయింపుల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసి అమలు చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవ ఈపీఎఫ్ఓను ఆదేశించారు . ఈ చర్య యజమానులతో పాటు ఉద్యోగుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడంతో పాటు ఈపీఎఫ్ తగ్గింపుల్లో పారదర్శకతను తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ ​​అధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సూచనలు చేశారు. మంత్రి సూచనలను పాటించాలని ఈపీఎఫ్ఓను ఆదేశించినట్లు ఆ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఉద్యోగులకు వారి జీతాల నుంచి చేసే పీఎఫ్ తగ్గింపుల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయడానికి సమర్థవంతమైన, సమయానుకూల డిజిటల్ యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని ఈపీఎఫ్ఓ ​​అధికారులను ఆయన ఆదేశించారు. యజమానులు, ఉద్యోగుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడంతో పాటు పారదర్శకతను పెంచాలని సూచించారు. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థకు సంబంధించిన మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ చర్యలు కీలకమని పేర్కొన్నారు.