భారతీయుల మేధస్సు.. నైపుణ్యం.. చారిత్రక నేపథ్యం బయటికి వస్తున్నాయి. ఫలితంగా అద్భుతమైన కట్టడాలు.. అంతకుమించి అనే స్థాయిలో ఉన్న పరిజ్ఞానం ప్రపంచ దేశాలకు తెలుస్తున్నాయి.
అలాంటిదే ఇది కూడా..
మనదేశంలో ప్రముఖమైన శివాలయాలలో కేదార్నాథ్ ఒకటి. కేదార్నాథ్ విశేషంగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం… ఈ క్షేత్రాన్ని నిర్మించిన తీరు.. ఆ క్షేత్రం చుట్టూ ఉన్న పరిసరాలు.. సాధారణంగా శివుడు కొలువై ఉన్న ప్రాంతాలకు వెళ్లడం నేటి రోజుల్లో పెద్ద కష్టం కాదు. ఎందుకంటే రవాణా సదుపాయాలు పెరిగిపోయాయి. రోడ్లు అధునాతనంగా నిర్మితమయ్యాయి. అందువల్ల శివుడు కొలువైన ప్రాంతాలకు ఒకప్పటితో పోల్చి చూస్తే సులువుగానే వెళ్లడం సాధ్యమవుతుంది. కానీ నేటి రోజుల్లోనూ కేదార్నాథ్ ప్రాంతానికి వాహనాల్లో వెళ్లడం కుదరదు. ఎందుకంటే ఆ ఆలయం నిర్మించిన ప్రాంతం అటువంటిది కాబట్టి. కాకపోతే అంతటి కఠినమైన వాతావరణం ఉన్న ప్రాంతంలో కేదార్నాథ్ ఆలయం నిర్మించడం ఇప్పటికి ఒక ఆశ్చర్యం. అద్భుతం.. అనన్య సామాన్యం.
తొలి శుభలేఖ మొదట ఆ దేవుడికి ఇవ్వాలి.. ఎందుకంటే..?
కేదార్నాథ్ ఆలయ నిర్మాణం భారతీయ వాస్తు పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. వందల సంవత్సరాలు ఎన్ని ప్రకృతి విపత్తులు ఎదురైనా సరే ఆలయం చెక్కుచెదరకుండా ఉందంటే మామూలు విషయం కాదు. వాస్తవానికి ఇ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనే విషయం ఇప్పటికీ సరిగ్గా తెలియదు. చరిత్రకారులు ఈ ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారని అంటుంటారు. ఈ ఆలయం వయసు 1200 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఇది నాటి కాలానికి సంబంధించిన భారతీయుల వాస్తు పరిజ్ఞానానికి, నిర్మాణ కౌశలానికి శిఖరం లాంటి ప్రతీక.
కేదార్నాథ్ ఆలయ నిర్మాణానికి ఎంచుకున్న ప్రదేశమే ఒక మిస్టరీ. నాటి స్థపతులు ఆలయాన్ని ఎలా నిర్మించారనేది ఇప్పటికీ ఒక రహస్యమే. ఒకవైపు 22, 000 అడుగుల ఎత్తులో కేదార నాధుడి కొండ ఉంది. మరోవైపు 21, 600 అడుగుల ఎత్తులో కరచ్ కుండ్ ఉంది. మూడో వైపు 22 వేల 700 అడుగుల ఎత్తులో భరత్ కుండ్ ప్రాంతం ఉంది. ఈ మూడు పర్వతాల మీదుగా మందాకిని, స్వరందరి, సరస్వతి, చిరుగంగ, మధు గంగ అనే ఐదు నదులు ప్రవహిస్తున్నాయి. చలికాలంలో ఈ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తుంది. వర్షాకాలంలో నీరు అత్యంత వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల నేటికీ ఇక్కడికి వాహనాలలో వెళ్లడం కుదరదు. అయితే ఇంతటి ప్రతికూల వాతావరణంలోనూ ఆలయాన్ని నిర్మించడం మామూలు విషయం కాదు. ఈ ఆలయానికి సంబంధించిన రాళ్ల చరిత్ర తెలుసుకోవడానికి లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు ఆలయం పూర్తిగా మంచుతో నిండి ఉందని తేలింది. ఆయనప్పటికీ ఆలయం చెక్కుచెదరలేదు.
2013లో కేదార్నాథ్ ఆలయాన్ని అత్యంత దారుణమైన వరద చుట్టుముట్టింది. ఆ ప్రాంతంలో సగటుకంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదయింది. చాలామంది మరణించారు. అయితే అంతటి వరదలోనూ ఆలయం చెక్కుచెదరలేదు. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యమయ్యేది కాదు. దీనిని ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. ఎలా పేర్చారు అనేది కూడా ఇప్పటికీ ఆశ్చర్యమే. అయితే దీని నిర్మాణానికి ఆస్టర్ అనే విధానాన్ని ఉపయోగించినట్టు తెలుస్తోంది. అప్పట్లో వరదలు వచ్చినప్పుడు ఒక పెద్ద బండరాయి వచ్చింది. సరిగ్గా అది గుడి వెనక ఆగిపోయింది. ఆ రాయి వల్ల వరద ప్రవాహం రెండుగా చీలిపోయింది. తద్వారా గుడికి ఎటువంటి నష్టం వాటిల్ల లేదు. దీనినిబట్టి కేదార్నాథ్ ప్రాంతంలో ఏదో ఉంది.. మనకు అంతు పట్టనిది.. మనం అంచనా వేయలేనిది ఏదో ఉంది.































