మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌.. ఎవరీ పవన్‌ దావులూరి?

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్, సర్ఫేస్‌ విభాగాలకు కొత్త బాస్‌ వచ్చారు. వీటిని నడిపించేందుకు ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరి (Pavan Davuluri)ని ఆ కంపెనీ నియమించింది.
ఈ విభాగానికి నాయకత్వం వహించిన పనోస్‌ పనయ్‌ (Panos Panay) గతేడాది అమెజాన్‌లో చేరడంతో ఆయన స్థానంలో పవన్‌కు బాధ్యతలు అప్పగించారు. మైక్రోసాఫ్ట్‌లో పవన్ 2001లో చేరారు. దాదాపు మూడేళ్లుగా కంపెనీలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.


పవన్‌.. ఐఐటీ మద్రాసులో తన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1999లో అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ పట్టా అందుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచే మైక్రోసాఫ్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. 2001లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా పదవి చేపట్టారు. వీటితోపాటు మైక్రోసాఫ్ట్‌లో వివిధ పదవులు నిర్వహించారు. తాజా నియామకానికి ముందు ఆయన విండోస్ సిలికాన్ అండ్‌ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌కు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇటీవలే మైక్రోసాఫ్ట్‌లో డీప్‌మైండ్ విభాగం మాజీ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా సులేమాన్‌ను ఏఐ బ్రాంచ్‌ అధిపతిగా ప్రకటించింది. ఆ తర్వాత పవన్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. తాజా నియామకంతో ఆయన అమెరికా టెక్‌ కంపెనీల్లో అత్యున్నత పదవులు చేపట్టిన భారతీయుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గతంలో విండోస్‌, సర్ఫేస్‌ విభాగాలకు వేర్వేరుగా అధిపతులు ఉండేవారు. తాజాగా పవన్‌కే రెండింటి బాధ్యతలనూ మైక్రోసాఫ్ట్‌ అప్పగించింది.