ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పై స్పష్టత వచ్చింది. పలు ప్రతిపాదనలు మంత్రివర్గ ఉపసంఘం వద్దకు వచ్చాయి. రెవిన్యూ డివిజన్లు.. మండలాల కూర్పు పైన కసరత్తు జరిగింది.
తాజాగా సీఎం చంద్రబాబు తో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలని ..అదే సమయంలో త్వరలో జరిగే నియోజకవర్గాల పునర్విభజన ను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం ఉండాలని స్పష్టం చేసారు.
ఏపీలో జిల్లాల పునర్విభజన కసరత్తు వేగవంతం అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలున్నాయి. వైసీపీ హయాంలో పార్లమెంట్ పరిధిని ఒక జిల్లాగా మార్పు చేసారు. 13 జిల్లాలను 26కు పెంచారు. ఎన్నికల సమయంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి తాజాగా రెవెన్యూ శాఖ కూడా ప్రతిపాదించింది.
అలాగే రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా ఉన్న మదనపల్లెను కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పరిశీలనకు వచ్చింది. దీనిపై చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలతో సంప్రదించాలని ఉపసంఘం భావిస్తున్నట్లు తెలిసింది. పోలవరం నిర్మాణం తర్వాత ముంపు మండలాలను ఏం చేయాలనే అంశం పైన చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన కేంద్రం దగ్గరగా ఉండే జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి.
ఇక, రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లోని 86 మండలాలను డివిజన్లు, జిల్లాలవారీగా మళ్లీ పునర్‌వ్యవస్థీకరణ కోసం ప్రతిపాదనలు వచ్చాయి. అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మార్చాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం మొత్తాన్నీ ప్రకాశం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్ కనిపిస్తోంది. భవిష్యత్‌లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాల పై నిర్ణయం జరగాలని సీఎం సూచించారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరికని గుర్తుచేశారు. పోలవరం ముంపు మండలాలపై కూడా స్పష్టత తీసుకురావాలని ఆదేశించారు.
దీంతో.. మంత్రివర్గ ఉపసంఘం తాజాగావచ్చిన ప్రతిపాదనల మేరకు కొన్ని జిల్లాల్లో పెంపు.. తగ్గుదల ద్వారా ప్రస్తుతం ఉన్న మండలాల సంఖ్యలో మార్పు ఉండదని చెబుతున్నారు . ఇక, రెవిన్యూ డివిజన్లు మాత్రం నాలుగు పెరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెవిన్యూ డివిజన్లు లో మరో నాలుగు పెరగనున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు చేసిన సూచనలు.. ప్రతిపాదనల పైన మరో సారి మంత్రివర్గ ఉప సంఘం ఈ రోజు సమావేశం కానుంది. ఈ నెల 7వ తేదీన జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రతిపాదనలు అందించే అవకాశం కనిపిస్తోంది. ఆ తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు పైన అధికారిక ప్రక్రియ ప్రారంభించి.. ప్రజాభిప్రాయం తరువాత ప్రకటించనున్నారు.
































