అత్యంత పవిత్రంగా భావించే ఈ కార్తీకమాసానికి పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివకేశవులకు అత్యంత ప్రీతకరమైన మాసంగా భావిస్తారు. అధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న నెల ఇది.
ఈ నెలలో ప్రతి సోమవారం శైవక్షేత్రాలను సందర్శించడానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. దీపారాధనలతో విరాజిల్లుతుంటాయి. ఈ నెల పొడవునా ఒకరకమైన ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తుంటుంది.
దీప కాంతులతో శైవ, వైష్ణవాలయాలు ధగధగమంటూ వెలిగిపోతుంటాయి. ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లుతుంటాయి. నదీ స్నానాలు, జపతాపాలు, గ్రామాల్లో తెల్లవారు జామునే వినిపించే భక్తి గీతాలు, ఘంటా నాదాలతో ఓ అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతుంటుంది ఈ కార్తీకమాసం. ఓ పాజిటివ్ వైబ్రేషన్స్‌ను కలిగిస్తుంది.
ఈ మాసంలో తప్పకుండా దర్శించుకోదగ్గది- వికారాబాద్ సమీపంలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. వందల సంవత్సరాల చరిత్ర గల శివాలయం ఇది. వికారాబాద్ కు ఏడు, హైదరాబాద్ కు 78 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. రావణ సంహారం తర్వాత రామేశ్వరానికి తిరిగి వచ్చిన శ్రీరాముడికి, అగస్త్య మహర్షి బ్రాహ్మణుడైన రావణుడిని చంపినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, జ్యోతిర్లింగాలను ప్రతిష్టించాలని సూచించారని కథనం.
అగస్త్య మహర్షి సూచనల మేరకు శ్రీరాముడు పలు చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించారు. అందులో శ్రీరాముడు ఈ ప్రాంతాన్ని సందర్శించి శివలింగాన్ని ప్రతిష్టించారని నమ్ముతారు. అభిషేకం కోసం నీటిని వెతుకుతూ ఉండగా ఎంతకూ దొరకలేదు. దీంతో భూమిలోకి బాణం వేయగా, అక్కడ నుండి బుగ్గ (బెలూన్ ఆకారంలో) నీరు ఉద్భవించింది. అందుకే దీనికి బుగ్గ రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చిందని చెబుతారు.
ఇక్కడి భూగర్భ జలధార నిరంతరం ఉద్భవిస్తూనే ఉంటుంది. ఏడాది పొడవునా ప్రవహిస్తుంది. ఆలయం పక్కనే ఉన్న కోనేటిలో కలుస్తుంది. ఈ నీరు చివరికి మూసీ నదికి చేరుతుంది. నందీశ్వరుడి నోటి నుండి వచ్చే ఈ జలధారకు ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికుల విశ్వాసం. అనంతగిరి అడవుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్న మొక్కల వేర్లను తాకుతూ ఈ నీరు ప్రవహించడం దీనికి కారణమని భావిస్తారు. ఈ నీరు అంత స్వచ్ఛంగా ఉంటుందని, అందులో పడిన సూది లేదా నాణెం కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ నీటిని సేవించడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు నయమవుతాయని, అందులో స్నానం చేస్తే చెడు ప్రభావాలు తొలగిపోతాయని ఆలయానికి వచ్చే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. మహాశివరాత్రి, కార్తీకమాసంలో భారీ సంఖ్యలో భక్తులు బుగ్గ రామేశ్వరుడిని దర్శించుకుంటారు. తెలంగాణలోని అత్యంత ఆకర్షణీయ పర్యాటక ప్రాంతాలలో ఒకటైన అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాకు గర్వకారణం.
హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే మూసీ నది జన్మస్థలమైన అనంతగిరి కొండలు, దాని మంత్రముగ్ధమైన అందంతో అనేక ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తాయి. అనంతగిరి కొండలలో ఉన్న పురాతన అనంత పద్మనాభ స్వామి ఆలయం అనేక మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉన్న విష్ణుమూర్తి పేరు మీదుగానే అనంతగిరికి ఈ పేరు వచ్చింది. ఈ జిల్లాలో పాంబండ రామలింగేశ్వర ఆలయం, భావిగి భద్రేశ్వర ఆలయం, ఏకంబరేశ్వర్ వంటి అనేక ఇతర దేవాలయాలను దర్శించుకోవచ్చు.































