వైసీపీలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. అధికారానికి దూరమైన పార్టీని వీడేందుకు ఆ పార్టీ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎంపీలు మోపిదేవి, బీద మస్తానరావు పార్టీని వీడగా తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీకి, పదవులకు కూడా రాజీనామా చేయనున్నారు.
ఏపీ వైఎస్సార్సీపీలో మరో రెండు వికెట్లు పడనున్నాయి. పార్టీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రెండ్రోజల క్రితం ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీకి, మండలి సభ్యత్వానికి రాజీనామా చేయగా తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తిలు రాజీనామా బాటలో నడువనున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రస్తుతం టీడీపీ తగినంత బలం లేదు. ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి 164 మంది సభ్యుల బలం ఉన్నా మండలిలో తగినంత బలం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకోవడంలో టీడీపీ చక్రం తిప్పుతోంది.
వైసీపీకి రాజీనామా చేసి వచ్చే వారికి పదవులకు భరోసా ఇస్తుండటంతో ఆ పార్టీకి పదవులకు రాజీనామా చేయడానికి ఎమ్మెల్సీలు మొగ్గు చూపుతున్నారు. 2019 ఎన్నికల్లో చీరాలలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన పోతుల సునీత ఆ తర్వాత కాలంలో వైసీపీలో చేరారు. ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అంతకు ముందే టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత 2019లో వైసీపీలో చేరారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఓటమి పాలవడంతో ఆమె తిరిగి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీలు మరికొందరు కూడా ఇదే బాటలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా కర్రి పద్మశ్రీ, బల్లికళ్యాణ్ చక్రవర్తిలు వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు. వారిని తిరిగి ఎమ్మెల్సీలుగా నియమిస్తారనే హామీ లభించినట్టు తెలుస్తోంది. వీలైనంత మందిని టీడీపీలో చేర్చుకునేందుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కళ్యాణ చక్రవర్తి తండ్రి బల్లి దుర్గా ప్రసాదరావు, తిరుపతి నియోజకవర్గం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. సెప్టెంబర్ 2020లో బల్లి దుర్గాప్రసాద్ గుండెపోటుతో చనిపోయారు.
2021లో కళ్యాణచక్రవర్తి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేయాలని భావించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కళ్యాణచక్రవర్తిని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అభ్యర్థిగా ప్రతిపాదించారు. కళ్యాణచక్రవర్తి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2026 మార్చి వరకు ఉంది. వైసీపీ ఓటమి పాలవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
పార్టీని వీడొద్దని పిల్లి విజ్ఞప్తి…
వైసీపీ నేతలు పార్టీని వీడొద్దని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. మరికొంత మంది ఎంపీలు వైసీపీని వీడుతారనే ప్రచారం నేపథ్యంలో పిల్లి స్పందించారు. తాను పార్టీ మారడం లేదన్నారు. పార్టీని వీడటం నైతికత కాదని, పదవికి రాజీనామా చేసినా మరొకరిని పార్టీ గెలిపించుకునే పరిస్థితిలో లేదని ఈ పరిస్థితుల్లో పార్టీని వీడటం ధర్మం కాదన్నారు.
నేతలు ఇలా చేయడం అన్యాయమని, ఎవరు పార్టీని వదిలి వెళ్ళకండని విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నపుడు నచ్చకపోతే వెళ్లిపోయి ఉండాల్సిందన్నారు. 2 సీట్ల నుంచి డిఎంకె అధికారంలోకి వచ్చిందని అధికారం శాశ్వతం కాదని 2 సీట్ల నుంచి బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. జయాపజయాలు సహజమని గెలిచినపుడు పొంగిపోయి, ఓడితే దిగాలు చెందడం సరికాదన్నారు. తాను వైసీపీలోనే ఉంటానని, రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని చెప్పారు.