నిర్మలమ్మ పద్దుపైనే మధ్యతరగతి పన్ను చెల్లింపుదారుల ఆశలు.. ఆ రాయితీలను పెంచే అవకాశం

www.mannamweb.com


కేంద్రంలో ఎన్‌డీఏ సర్కార్ మూడో సారి కొలువుదీరింది. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు.

సాధారణంగా బడ్జెట్‌ను ఆర్థిక సంవత్సర ముగింపులో ప్రవేశపెడతారు. ఎన్నికల ఏడాది మాత్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. తర్వాత కేంద్రంలో కొలువుదీరిన నూతన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఎన్నికల అనంతరం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై అన్ని రంగాల ప్రజలు ప్రత్యేక ఆసక్తిని చూపుతూ ఉంటారు. ప్రజలకు మేలు చేసే చాలా నిర్ణయాలు ఎన్నికల అనంతరం బడ్జెట్‌లో ప్రకటిస్తూ ఉంటారు. అయితే 2024-25కు సంబంధించిన బడ్జెట్‌పై దేశంలోని పన్ను చెల్లింపుదారులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుల్లో రాయితీలను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొనడం ఈ బడ్జెట్‌ గురించి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ పరిమితిని పెంచుతున్నారనే అంచనాల మధ్య కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో? చూస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పరిమితి దశాబ్ద కాలంగా పెంచలేదు. ఆ పరిమితి విషయంలో కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై మధ్యతరగతి పన్ను చెల్లింపులు అంచనాల ఎలా ఉన్నాయో? ఓసారి తెలుసుకుందాం.

ఆదాయపు పన్ను స్లాబ్ లో రాయితీ

కేంద్ర ప్రభుత్వ ఈ ఏడాది బడ్జెట్‌లో పన్ను శ్లాబ్స్‌లో మినహాయింపును కోరుతున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుతున్నారు. కొత్త పన్ను విధానంలో వర్తించని కొన్ని మినహాయింపులను కూడా అందించాలని పేర్కొంటున్నారు.

సెక్షన్ 80సీ పరిమితి పెంపు

ప్రస్తుతం రూ. 1.5 లక్షలుగా ఉన్న సెక్షన్ 80సీ మినహాయింపు పరిమితిని పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. దశాబ్ద కాలంగా ఈ పరిమితిని పెంచలేదని పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఈ పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచాలని అంటున్నారు. హెూమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ల కోసం ప్రత్యేక తగ్గింపును గృహ కొనుగోలుదారులు ఎక్కువగా కోరుతున్నారు. ప్రస్తుతం సెక్షన్ 80సీ జీవిత బీమా ప్రీమియంలు, ట్యూషన్ ఫీజులు, ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్లు, హెూమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్లతో సహా వివిధ ఖర్చుల కోసం రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును అనుమతిస్తుంది. అయితే ఈ పరిమితిని పెంచడం ద్వారా గృహ కొనుగోలుదారులకు కూడా మేలు జరగనుంది.

స్టాండర్డ్ డిడక్షన్‌లో పెంపు

ఇటీవల కాలంలో వైద్య ఖర్చులు, ఇంధన ఖర్చులతో విపరీతంగా పెరుగుతున్నాయి. అందువల్ల స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఈ సర్దుబాటు వల్ల ప్రస్తుత ఆర్థిక ఒత్తిళ్ల దృష్ట్యా వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గతుంది. తద్వారా మధ్యతరగతి ఉద్యోగులు ఖర్చుల నుంచి కాస్త ఉపశమనం పొందుతారు

సెక్షన్ 80డి తగ్గింపు పరిమితి పెంపు

సెక్షన్ 80డి కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల తగ్గింపు పరిమితిని పెంచాలని మధ్యతరగతి ఉద్యోగులు కోరుతున్నారు. ఈ పరిమితిని రూ. 25,000 నుండి రూ. 50,000కి సీనియర్ సిటిజన్లకు రూ. 50,000 నుంచి రూ. 75,000కి పెంచడం వల్ల పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల నుంచి మెరుగైన ఆర్థిక రక్షణ లభిస్తుందని అంటున్నారు.