ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం..! ఏపీ ఎన్నికల్లో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

Ap Election Resluts 2024: ఏపీ ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? నాలుగున్నర దశాబ్దాలుగా ఒకే జిల్లాలో ఆ నాలుగు నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీయే ఇప్పటివరకు అధికారం చేపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి చూపు ఆ సెగ్మెంట్లపైనే ఉంది. మరి సెంటిమెంట్ నియోజకవర్గాలు ఏవి? ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి?


46ఏళ్లుగా వస్తున్న సెంటిమెంట్..
ప్రజలు, పార్టీల్లో సెంటిమెంట్ అంటే ఒక నమ్మకం, విశ్వాసం. ఇదే సెంటిమెంట్ ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియజేయబోతోంది. అవును.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం. ఈ సెంటిమెంట్ ఇప్పటిది కాదు. నాలుగున్నర దశాబ్దాల నుంచి వస్తున్నది. అందుకే ఆ నాలుగు నియోజకవర్గాల్లో గెలిస్తే అధికారంలోకి వచ్చినట్లే అన్నట్లు పార్టీలు భావిస్తాయి.

అక్కడ ఎవరు గెలిస్తే వారిదే అధికారం..
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో గత 46ఏళ్లుగా ఒకే పార్టీ గెలుస్తూ వస్తోంది. విచిత్రం ఏంటంటే.. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది.

1978లో అధికారంలోకి కాంగ్రెస్.. 1983, 85లో టీడీపీ ప్రభుత్వం..
1978 ఎన్నికల్లో ఈ నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1983, 85 ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలవగా ఆ పార్టీయే అధికారాన్ని దక్కించుకుంది. 1989లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా.. అధికారం హస్తగతమైంది. 1994, 1999లలో టీడీపీ అభ్యర్థులు గెలవగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ సీఎం అయ్యారు. 2009లో ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరోమారు రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు.

2019లో వైసీపీ గెలుపు..
ఏపీ విభజన తర్వాత కూడా ఈ నాలుగు సెంటర్లలో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. 2014లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలవగా.. చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో ఈ నాలుగింటిలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో రాష్ట్రంలోనూ వైసీపీ ప్రభుత్వమే ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.

ఏలూరు, భీమవరం, ఉంగుటూరులో కూటమి అభ్యర్థులదే గెలుపు?
ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగాయి. అయితే, ఈ నాలుగు నియోజకవర్గాల్లో కేవలం ఏలూరులో మాత్రమే టీడీపీ పోటీలో ఉంది. మిగిలిన మూడు స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏలూరులో టీడీపీ అభ్యర్థి బడేటి చంటి, భీమవరంలో జనసేన అభ్యర్థి పులవర్తి రామాంజనేయులుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు వైసీపీ అభ్యర్థిపై పైచేయి సాధిస్తారని ప్రచారం జరుగుతోంది. అటు పోలవరంలో మాత్రం వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గెలుస్తారంటూ భారీగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి.

ఈసారి గెలిచేది ఎవరు?
సర్వేలు, బెట్టింగ్ ల ప్రకారం పోలవరం వైసీపీ గెలిస్తే.. మిగిలిన మూడు కూటమి గెలిస్తే 46ఏళ్ల సెంటింట్ కు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వైసీపీ గెలిస్తే.. దాదాపు ఆ పార్టీయే అధికారం చేపడుతుంది. లేకపోతే నాలుగింటిలోనూ కూటమి అభ్యర్థులే గెలిస్తే.. సెంటిమెంట్ రిపీట్ అవుతుంది.

ఈ ఎన్నికల్లో 46ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుంది?
ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా విభిన్న ప్రాంతాలు. ఏలూరు నగరం కాగా, భీమవరం పట్టణం, ఉంగుటూరు గ్రామీణ ప్రాంతం కాగా పోలవరం ఏజెన్సీ ప్రాంతం. ఇలా నాలుగు నియోజకవర్గాల్లోనూ విభిన్న ప్రాంత ఓటర్లు ఉన్నారు. విభిన్న ఓటర్లు ఉన్నా తీర్పు మాత్రం విలక్షణంగా ఒకే రిజల్ట్ ఉండటంతో ప్రస్తుతం అందరి చూపు ఈ నియోజకవర్గాలపైనే ఉంది. మరి ఈ ఎన్నికల్లో 46ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుంది? లేక అంచనాలను తలకిందులు చేస్తూ సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుందా? తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే.