ఇంకొన్ని రోజుల్లో రెడ్‌మీ నోట్ 15 5జీ సిరీస్ లాంచ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త నోట్ 15 5జీ సిరీస్‌ను వచ్చే వారం భారత మార్కెట్​లో విడుదల చేయనుంది. 108 మెగాపిక్సెల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వంటి అధునాతన ఫీచర్లతో రానున్న ఈ ఫోన్ల ధర, స్పెసిఫికేషన్లపై ఒక లుక్కేయండి.

స్మార్ట్​ఫోన్​ లవర్స్​ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 15 5జీ, రెడ్‌మీ నోట్ 15 5జీ 108 మాస్టర్ పిక్సెల్ ఎడిషన్ వచ్చే వారం భారత్‌లో లాంచ్ కానున్నాయి. షావోమీ ఇప్పటికే ఈ ఫోన్లకు సంబంధించిన డిజైన్, కలర్ ఆప్షన్లు, కీలక ఫీచర్లను టీజ్ చేస్తూ అందరిలో ఆసక్తిని పెంచేసింది. ఈ స్మార్ట్‌ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌తో పాటు రెడ్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.


స్టాండర్డ్ రెడ్‌మీ నోట్ 15 5G మోడల్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తుండగా, ఇందులో 5,520ఎంఏహెచ్​ బ్యాటరీని అమర్చారు. ఇక ‘మాస్టర్ పిక్సెల్ ఎడిషన్’ ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ ప్రియుల కోసం 108 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో రాబోతోంది.

లాంచ్‌కు ముందే ఈ ఫోన్ల ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి:

రెడ్​మీ నోట్​ 15- లాంచ్ ఎప్పుడు?

రెడ్‌మీ నోట్ 15 5జీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు జనవరి 6న ఉదయం 11 గంటలకు ఇండియాలో అధికారికంగా విడుదల కానున్నాయి. కంపెనీ తన వెబ్‌సైట్‌లో ఇప్పటికే దీని కోసం ఒక ప్రత్యేక ఈవెంట్ పేజీని కూడా ఏర్పాటు చేసింది.

రెడ్​మీ నోట్​ 15- ధర ఎంత ఉండవచ్చు? (అంచనా)

ధర విషయంలో కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే నెట్టింట లీక్ అయిన సమాచారం ప్రకారం:

8జీబీ ర్యామ్​ + 128జీబీ స్టోరేజ్: సుమారు రూ. 22,999.

8జీబీ ర్యామ్​ + 256జీబీ స్టోరేజ్: సుమారు రూ. 24,999.

గత నెల పోలాండ్‌లో లాంచ్ అయిన ఈ మోడల్ (6జీబీ + 128జీబీ) ధర దాదాపు రూ. 30,000గా ఉంది. కానీ భారత్‌లో పోటీని తట్టుకునేందుకు తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని టెక్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రెడ్​మీ నోట్​ 15- ప్రత్యేకతలు, ఫీచర్లు..

డిజైన్: ఈ స్మార్ట్​ఫోన్ బ్లాక్, బ్లూ, పర్పుల్ రంగుల్లో లభించనుంది. దీని డిజైన్ కర్వ్డ్ బాడీ, కర్వ్డ్ డిస్‌ప్లేతో ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. వెనుక వైపు స్క్విర్కిల్ ఆకారంలో ఉన్న కెమెరా మాడ్యూల్‌లో రెండు కెమెరాలు ఉంటాయి.

డిస్‌ప్లే: 6.77 ఇంచ్​ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోంది. ఇది 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. కళ్లకు రక్షణగా ‘టీయూవీ ట్రిపుల్ ఐ కేర్’ సర్టిఫికేషన్, తడి చేతులతో కూడా వాడగలిగేలా ‘హైడ్రో టచ్ 2.0’ ఫీచర్ ఇందులో ఉన్నాయి.

పెర్ఫార్మెన్స్: రెడ్‌మీ నోట్ 15 5జీలో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది పాత మోడల్ కంటే 10 శాతం మెరుగైన గ్రాఫిక్స్ (జీపీయూ), 30 శాతం మెరుగైన పనితీరును (సీపీయూ) అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ లేటెస్ట్ ‘హైపర్​ఓఎస్​ 2’తో పనిచేస్తుంది. అలాగే ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ66 రేటింగ్‌ను కలిగి ఉంది.

బ్యాటరీ: 5,520ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు ఒకటిన్నర రోజుపైగా వాడుకోవచ్చని, బ్యాటరీ లైఫ్ ఐదేళ్ల వరకు క్వాలిటీగానే ఉంటుందని కంపెనీ హామీ ఇస్తోంది.

కెమెరా: ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది ఐఓఎస్​ సపోర్ట్‌తో 4కే వీడియో రికార్డింగ్‌ను అందిస్తుంది. పోలాండ్ వేరియంట్ తరహాలోనే ఇండియాలో కూడా 8ఎంపీ సెకండరీ కెమెరా, 20ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

రెడ్​మీ నోట్​ 15 5జీ ‘మాస్టర్ పిక్సెల్ ఎడిషన్’ ఫోన్ పూర్తిగా ఫోటోగ్రఫీ సామర్థ్యాల మీద దృష్టి సారించనుంది.

ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.