నగరంలో ఓ మనిషి నెలకు 50 వేల రూపాయలు సంపాదించినా.. నెలాఖరున కచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇక నగరజీవి తప్పనిసరి పరిస్థితుల్లో.. భారీగా ఖర్చు చేయాల్సిన ముఖ్యమైన విషయం అద్దె. చిన్న చిన్న గదులకు కూడా వేలల్లో రెంట్ వసూలు చేస్తారు. కుటుంబంలో నలుగురు మనుషులుంటే.. కనీసం సింగిల్ బెడ్రూం అయినా తీసుకోవాల్సిందే. నగరంలో వీటికి అద్దె 10 వేల నుంచి 15 వేల రూపాయల వరకు ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో సింగిల్ రూమ్ రెంటే వేలల్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు, ఐటీ కార్యాలయాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో రెంట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో అద్దెలు వేలల్లో ఉంటాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ ఫొటో చూస్తే.. ముందు ఆశ్చర్యం కలుగుతుంది.. ఆ తర్వాత దాని రెంట్ వింటే హార్ట్ ఎటాక్ వస్తుంది. చిన్న మంచం, ఓ టేబుల్ పట్టేంత రూమ్.. కనీసం కిటికీ కూడా లేని ఆ గది అద్దె 10 వేల రూపాయలు. ఇప్పుడీ వార్తే నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకు మరి ఇంత భారీ రెంట్ చెల్లించి.. కిటికీలు కూడా లేని ఆ గదిలో ఎవరుంటున్నారంటే.. ఓ విద్యార్థి. అయితే ఇది మన దగ్గర కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో. హస్తిన నగరం ఐఏఎస్ కోచింగ్‌కు ప్రసిద్ధి చెందింది. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు.. బంగారు భవిష్యత్తు గురించి బోలేడు కలలతో ఇక్కడ అడుగుపెడతారు. చదువు సంగతి ఏమో కానీ ఢిల్లీలో వసతి దొరకడం చాలా కష్టం. లభించినా ఇదుగో ఇంత భారీ ఎత్తున చెల్లించాలి.
ఈ ఫొటోని రిషబ్ తివారీ అనే విద్యార్థి ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అవుతోంది. ఇది ఢిల్లీలోని రాజేందర్ నగర్, ముఖర్జీ నగర్ ఏరియాల్లోని పరిస్థితి అని.. ఇక్కడ సివిల్స్, గ్రూప్స్ కోచింగ్ కోసం నిత్యం వేలాది మంది విద్యార్థులు తరలి వస్తారని.. అందుకే ఈ ప్రాంతాల్లో హాస్టల్స్, రూములు, ఇళ్లకు ఇంత డిమాండ్ అని తెలిపాడు. అసలు ఈ ఏరియాల్లో అద్దెకు దొరకడమే చాలా కష్టం అన్నాడు. దొరికినా ఇదుగో ఇలా అరకొర సౌకర్యాలతో.. అత్యధిక రెంట్ వసూలు చేసేవి ఉంటాయని చెప్పుకొచ్చాడు.
‘‘ఈ రూమ్‌లో ఒక్క మనిషి పట్టడమే చాలా కష్టం. పడుకోవడానికిక ఒక చిన్న మంచం.. పక్కనే చిన్న టేబుల్.. దాని మీద ఓ చిన్న ఫ్యాన్.. గొడకు మరో ఫ్యాన్.. ఓ చిన్న అల్మరా.. వెంటిలేషన్ సంగతి మర్చిపోవాలి. ఎందుకంటే ఈ గదికి కిటికీ కాదు కదా చిన్న హోల్ కూడా లేదు. బాత్రూం లేదు. పది మందికి ఒక్కటే ఉంది. ఇది జస్ట్ వచ్చి పడుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. ఇక ఈ గది అద్దె రూ.10 వేలు. ఇదే డబ్బులు పెడితే మా ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇల్లు అద్దెకు దొరుకుతుంది. గ్రూప్స్ కోచింగ్ కోసం వచ్చిన నేను ఈ అగ్గిపెట్టెలాంటి గదికి 10 వేల రూపాయలు చెల్లిస్తున్నాను.. ఉద్యోగం కోసం.. ఇబ్బంది అయినా తప్పడం లేదు’’ అని తన ఆవేదన వ్యక్తం చేశాడు రిషబ్.
ఈపోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది తమది కూడా ఇదే పరిస్థితి అని చెబుతున్నారు. ఉద్యోగం కోసం ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటున్నారు. ఇక మరి కొందరేమో.. కాస్త దూరం వెళ్తే.. ఇంతకన్నా మంచి రూమ్‌లు దొరుకుతాయి.. రెంట్ కూడా తక్కువ.. మెట్రో సౌకర్యం కూడా ఉంది అని చెబుతున్నారు.