నవీన్ పట్నాయక్ రాజకీయ వారసుడిగా చెప్పబడుతున్న వీకే పాండియన్ సంచలన నిర్ణయం..

Naveen Patnaik: ఒడిశాలో నవీన్ పట్నాయక్‌కి చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ) దారుణంగా ఓడిపోయింది. రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది.


మరోవైపు ఎంపీ సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ తర్వాత వీకే పాండియన్ పేరు ప్రముఖంగా వినిపించింది. మాజీ బ్యూరోక్రాట్, తమిళనాడుకు చెందిన వ్యక్తి అయిన వీకే పాండియన్ బీజేడీలో కీలకంగా వ్యవహరించారు. అయితే, నవీన్ పట్నాయక్ ఇలా అధికారుల చేతిలోకి వెళ్లారని బీజేపీ విమర్శించింది.

ఇదిలా ఉంటే, బీజేడీ దారుణ పరాజయం తర్వాత వీకే పాండియన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఆయన ఇందులో ఈ విషయాన్ని ప్రకటించారు. ఒక సామాన్య కుటుంబం, చిన్న గ్రామం నుంచి వచ్చినట్లు చెప్పారు. ఐఏఎస్‌లో చేరి ప్రజలకు సేవ చేయాలనేది తన చిన్ననాటి కల అని చెప్పారు. నేను ఒడిశా గడ్డపై అడుగు పెట్టిన రోజు నుండి, ఒడిశా ప్రజల నుండి నాకు అపారమైన ప్రేమ మరియు ఆప్యాయత లభించింది వెల్లడించారు. రాష్ట్ర ప్రజల కోసం చాలా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించానని తెలిపారు.

బీజేడీ తిరిగి అధికారంలోకి వస్తే దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసే మైలురాయిని చేరుకునేందుకు నవీన్ పట్నాయక్ కోసం పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు పాండియన్ చెప్పారు. నాకు లభించిన అనుభవం జీవితాంతం ఉంటుందని, ఒడిశా ప్రజల పట్ల ప్రేమ తనకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.

ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉంటే 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేడీ 51, కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందాయి. గత ఎన్నికల్లో బీజేపీకి అక్కడ కేవలం 23 సీట్లనే గెలుచుకుని, ఈసారి మాత్రం అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 21 ఎంపీ స్థానాల్లో బీజేపీ 20 స్థానాలను గెలుచుకుంది.