ఉగాది పండుగ రోజు ప్రత్యేకంగా చేసే ఉగాది పచ్చడి అంతరార్థం ఏమిటో మీకు తెలుసా? ఉగాది పచ్చడిలో షడ్రుచులు దేనికి సంకేతం? ఉగాది పచ్చడిలో వేప పువ్వు ఎందుకు వేస్తారు? ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి? ఈ ఆసక్తికరమైన విషయాలు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఉగాదికి ప్రత్యేకత తెచ్చేది పచ్చడే!
తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. మామూలుగా ఏ పండుగ రోజైనా స్పెషల్గా పిండివంటలు, గారెలు, బూరెలు, పాయసం లాంటి వంటకాలు ఉంటాయి. కానీ ఉగాది స్పెషల్ మాత్రం ఉగాది పచ్చడే! తెలుగువారికి మాత్రమే ప్రత్యేకమైన ఈ ఉగాది పచ్చడి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
షడ్రుచుల సమ్మేళనం
మరే ప్రాంతాలలో లేని షడ్రుచుల సమ్మేళనంగా తయారయ్యే ఉగాది పచ్చడి తెలుగువారికి మాత్రమే సొంతం. జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశం అందరికీ అందించడమే ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీక అని శాస్త్రం చెబుతోంది.
ఆరు రుచులే కీలకం
ఉగాది పచ్చడి తయారీలో తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అనే ఆరు రకాల రుచులు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే! ఇప్పుడు ఉగాది పచ్చడిలో ఏ రుచి కోసం ఏ పదార్థం వాడుతారో చూద్దాం.
తీపి
ఉగాది పచ్చడిలో తీపి కోసం కొత్త బెల్లాన్ని వాడుతారు. బెల్లం శరీరానికి శక్తిని అందించి జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. బెల్లం మధురంగా ఉంటుంది. ఈ మధురమైన రుచి రానున్న కొత్త సంవత్సరం మనకు సుఖసంతోషాలను అందించాలని కోరుకుంటూ బెల్లాన్ని ఇందులో వాడుతాం.
పులుపు
ఉగాది పచ్చడిలో పులుపు కోసం కొత్త చింతపండును వేస్తారు. చింతపండులోని పులుపు కఫ, వాతాల వల్ల వచ్చే రుగ్మతలను పోగొడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అలాగే పులుపు రుచి విసుగుకి సంకేతం. నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితిలోనూ విసుగు చెందకుండా నేర్పుగా, ఓర్పుగా ఉండాలన్న సంకేతం మనకు ఈ పులుపు రుచి నేర్పిస్తుంది.
కారం
ఉగాది పచ్చడిలో మూడో రుచి కారం. ఇందు కోసం మిరియాలు లేదా పచ్చి మిరపకాయలు కానీ, మిరప్పొడి కానీ వాడతారు. కారం మనిషి శరీరంలోని హానికారక క్రిములను నాశనం చేసి పంచేంద్రియాలు చురుగ్గా పనిచేయడానికి దోహదపడుతుందని చెబుతారు. కారం కఠినమైన పరిస్థితులకు సంకేతం. కొత్త సంవత్సరంలో జీవితంలో ఎదురయ్యే కఠినమైన పరిస్థితులను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలన్న సంకేతం ఉగాది పచ్చడిలో ఈ కారం సూచిస్తుంది.
ఉప్పు
ఉగాది పచ్చడిలోని నాలుగో రుచి ఉప్పు. దీని కోసం సముద్ర ఉప్పు కానీ, సైంధవ లవణం కానీ వాడుతారు. ఉప్పు మనిషికి ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. ‘ఉప్పు లేని కూర చప్పనగును’ అని కవులు కూడా వర్ణిస్తారు. ఉప్పు లేకపోతే జీవితమే నిస్సారంగా ఉంటుంది. ఉగాది పచ్చడిలో ఉప్పు రుచి కొత్త సంవత్సరంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో ఉండాలన్న స్ఫూర్తిని అందిస్తుంది.
చేదు
ఉగాది పచ్చడిలో చేదు కోసం లేత వేపపువ్వు వాడుతారు. వేపపువ్వు ఋతువులు మారడం వలన కలిగే అనేక రోగాలను తరిమి కొడుతుంది. చేదు రుచి రానున్న సంవత్సరంలో జీవితంలో కలిగే బాధలకు దుఃఖానికి సంకేతంగా నిలుస్తుంది. అప్పుడప్పుడు జీవితానికి చేదు అనుభవాలు కూడా అవసరమే కదా! చేదు అనుభవాలను పాఠాలుగా తీసుకొని ముందుకెళ్లాలన్న సంకేతమే ఉగాది పచ్చడిలో చేదు రుచి తెలుపుతుంది.
వగరు
ఉగాది పచ్చడిలో వగరు రుచి కోసం అప్పుడప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలను వేస్తారు. లేత మామిడి పిందెలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉగాది పచ్చడిలో వగరు రుచి కొత్త సవాళ్లకు సంకేతం. రానున్న కొత్త సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్ళకు మనల్ని సిద్ధం చేయడమే ఉగాది పచ్చడిలో వగరు రుచి అంతరార్థం.
షడ్రుచులు సమానంగా స్వీకరిద్దాం
ఎన్నో ఔషధగుణాలు ఉన్న షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఉగాది పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారంలో ఉండే ఔషధ గుణాలను స్వీకరిస్తూ, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ కొత్త సంవత్సరమంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటామని విశ్వాసం. ఇదే ఉగాది పచ్చడి ప్రత్యేకత!
నూతన సంవత్సరంలో ఉగాది పచ్చడి తినేటప్పుడు తప్పకుండా చదువాల్సిన శ్లోకం ఇదే!
“శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ
సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్॥”
అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు!!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.