ఈ రాయి బరువు 50 గ్రాములు.. ధర మాత్రం రూ. 850 కోట్లు

www.mannamweb.com


పెద్దలు ఎప్పుడు ఒక మాట చెబుతుంటారు. జీవితంలో నాలుగు రాళ్లు వెనక వేసుకోమని. అంటే ఎంతో కొంత పొదుపు చేయమని దాని అర్థం. ఇదుగో పైన చూపిన రాయి చూశారా.. అలాంటి ఒక్క రాయి మీ దగ్గర ఉంటే చాలు.. వందల కోట్ల రూపాయలు ఉన్నట్లే. అలాంటిది ఓ నాలుగు రాళ్లు ఉంటే.. ఇక మీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నట్లే. ఎందుకంటే కేవలం 50 గ్రాముల ఈ రాయి ఖరీదు ఏకంగా 800 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. మరి ఈ రాయి ప్రత్యేకత ఏంటి.. ఎందుకంత ఖరీదు.. అసలెక్కడ దొరికిందంటే..

పైన చూపించిన రాయిని కాలిఫోర్నియం అంటారు. దీని విలువ కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంటుంది. అత్యంత ఖరీదైన ఈ రాయిని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన బిహార్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల కాలిఫోర్నియంను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ.850 కోట్లు ఉంటుందని అంచనా. దీన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు స్మగ్లర్లును పోలీసులు అరెస్టు చేసినట్లు గోపాల్‌గంజ్‌ ఎస్పీ స్వర్ణ్‌ ప్రభాత్‌ శుక్రవారం తెలిపారు. ఒక్కో గ్రాము విలువ రూ.17 కోట్లు పలుకుతుందని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’అత్యంత విలువైన వస్తువును అక్రమ రవాణా చేస్తున్నట్లు మాకు సమాచారం అందింది. దాంతో వివిధ ప్రత్యేక విభాగాలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఒక స్పెషల్ టీం బీహార్-ఉత్తరప్రదేశ్-బల్తారీ సరిహద్దులో మోహరించింది. ఇదే మార్గంలో గురువారం సాయంత్రం మోటార్‌బైక్‌ మీద వస్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా కాలిఫోర్నియం దొరికింది. వారి నుంచి నాలుగు మొబైల్ ఫోన్‌లు, 50 గ్రాముల కాలిఫోర్నియం స్వాధీనం చేసుకున్నాం‘ అని తెలిపారు. దీనిపై అణు ఇంధన శాఖకు కూడా సమాచారం ఇచ్చామన్నారు.

నిజానికి కాలిఫోర్నియం అనేది అత్యంత అరుదైన రేడియోధార్మిక పదార్థం. ఇది పర్యావరణంలో సహజంగా లభించే పదార్థం కాదు. ప్రయోగశాలల్లో హెచ్చు పీడనంతో కూడిన ఐసోటోప్‌ రియాక్టర్లలో దీనిని తయారు చేస్తారు. కాలిఫోర్నియంను తయారు చేయగల సామర్థ్యమున్న అణు రియాక్టర్లు రెండే ఉన్నాయి. అందులో ఒకటి అమెరికాలో, రెండోది రష్యాలో ఉంది. 1950లో దీన్ని తొలిసారిగా తయారు చేశారు. కాలిఫోర్నియంను భూగర్భంలో బంగారు, వెండి నిల్వల అన్వేషణతోపాటు చమురు, నీటి పొరలను గుర్తించేందుకు వినియోగిస్తారు అని చెప్పుకొచ్చారు.