‘నవోదయ’లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేశారా?ఇంకా కొద్దిరోజులే ఛాన్స్‌

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో (JNV) 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.


దేశ వ్యాప్తంగా 654 జేఎన్‌వీల్లో 6వ తరగతిలో సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష(JNVST 2026) నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13 (శనివారం)న; జమ్మూ కశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏప్రిల్ 11న JNV ప్రవేశ పరీక్ష (Jawahar Navodaya Vidyalaya selection test) నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన, అర్హులైన విద్యార్థులు జూలై 29 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

  • ‘పీఎం రాష్ట్రీయ బాల్‌పురస్కార్‌’కు దరఖాస్తులు.. ఈ విశేషాలు తెలుసా?

ఎంపిక ప్రక్రియ ఇలా!

జేఎన్‌వీలో సీటు సాధిస్తే.. విద్యార్థులు ఆరో తరగతి నుంచి నుంచి ప్లస్‌ టు వరకూ నిశ్చింతగా చదువుకునే సువర్ణావకాశం దక్కుతుంది. ఇక్కడ చదువుతోపాటు ఆటపాటలకు, సమగ్ర వికాసానికీ ప్రాధాన్యమిస్తారు. దేశవ్యాప్తంగా 654 నవోదయ విద్యాలయాలు ఉండగా.. ఏపీలో 15, తెలంగాణలో 9 చొప్పున ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తుంది. అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలోనే ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువున్నవారై ఉండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు. 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయించగా.. మిగతా 25 శాతం సీట్లకు ఎవరైనా పోటీ పడొచ్చు. గ్రామీణ కోటాలో సీటు ఆశించే విద్యార్థులు 3,4,5 తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో లేదా గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల్లో చదవాలి. మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు కొన్ని సీట్లు ఉన్నాయి. బాలబాలికలకు విడిగా వసతి కల్పిస్తారు.

పరీక్ష ఎలా ఉంటుంది?

ఈ పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. విద్యార్థి తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌.. ఇలా కోరుకున్న మాధ్యమంలో పరీక్ష రాసే వీలుంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మూడు సెక్షన్ల నుంచి మొత్తం 80 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. వీటిని 2 గంటల్లో పూర్తిచేయాలి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు. నెగెటివ్‌ మార్కుల్లేవు. సమాధానం గుర్తించడానికి బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్ను ఉపయోగించి, ఓఎంఆర్‌ పత్రంలో సరైన ఆప్షన్‌ సూచించే గడిని దిద్దాలి. ఇక్కడ సీటు పొంది చదివినవారికి ఐఐటీ జేఈఈ, నీట్‌ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ రాణించేలా శిక్షణ అందిస్తారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.