కరెంటు ఉండదు.. ఫోన్ వాడరు.. డబ్బులు లేవు.. ఈ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా?

 భారతదేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అని కొందరు మేధావులు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. గ్రామాల్లో అభివృద్ధి జరిగితే దేశం బాగుపడట్లేనని మరికొందరు ప్రస్తావిస్తూ ఉంటారు.


ఇందులో భాగంగా ప్రస్తుతం చాలా గ్రామాలు అభివృద్ధి పథంలోకి వెళ్తున్నాయి. పట్టణాల్లో, నగరాల్లో ఉండే జీవన విధానం గ్రామాల్లో కూడా కొనసాగుతోంది. మారుమూల గ్రామాల్లో సైతం ఇంటర్నెట్, అత్యాధునిక సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. అయితే ఓ గ్రామంలో మాత్రం ఇప్పటికీ పూర్వకాలంలో పాటించిన పద్ధతులు పాటిస్తున్నారు. కరెంటు వాడకుండా.. ఇంటర్నెట్ లేకుండా.. మనీ ట్రాన్స్ఫర్ చేయకుండా.. సహజ పద్ధతులను ఉపయోగిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ గ్రామం గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..

ఆంధ్రప్రదేశ్లోని కూర్మా గ్రామం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచింది. ప్రపంచానికి దూరంగా.. ఆధునికతకు వ్యతిరేకంగా ఈ గ్రామం కొనసాగుతోంది. ఇక్కడ జీవన వ్యవహారాలు అత్యంత సహజసిద్ధంగా ఉంటాయి. సాంప్రదాయ పద్ధతులు.. సహజమైన ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ కరెంటు ఉండదు. సూర్యుడు వెళ్లిపోయిన తర్వాత చీకటిలోనే చిన్న హారతి ఇచ్చి వెంటనే నిద్రిస్తారు. ఉదయం సూర్యుడు రాకముందే స్నానం ఆచరించి హారతి ఇచ్చి తమ కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. అయితే వీరు కరెంటు వాడకపోవడానికి అనేక కారణాలు చెబుతున్నారు. సూర్యుడు వెళ్లిపోయిన తర్వాత చాలామంది కరెంటుతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరుసటి ఉదయం సూర్యుడు వచ్చినా కూడా నిద్ర లేవడం లేదు. దీంతో వారి ఆలోచనల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. కొందరిలో రాక్షస ఆలోచనలు వచ్చి తప్పులు చేస్తున్నారు. అందువల్ల కరెంటు వాడకపోవడమే మంచిదని భావించినట్లు వారు పేర్కొంటున్నారు.

ఇక మొబైల్ విషయంలోనూ ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇళ్లలో ఏ ఒక్కరికి మొబైల్ ఉండదు. మొబైల్ చూడడం వల్ల మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నేటి కాలంలో చిన్న పిల్లలు మొబైల్ తో గడుపుతున్నారు. దీనివల్ల వారు భవిష్యత్తులో అనేక రకాల మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల మొబైల్ కు దూరంగా ఉండాలని అనుకున్నట్లు ఈ గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు.

ఇవే కాకుండా ఇక్కడ విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడి గ్రామ ప్రజలు వారి పరిసరాల్లోనే ఆహారానికి కావాల్సిన పదార్థాలను పండించుకుంటారు. మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తెచ్చుకోవడానికి సాహసించరు. ఒకరికి ఉన్న వస్తువులు మరొకరికి ఇస్తూ ఇలా వస్తు మార్పిడి చేసుకుంటూ ఉంటారు. ఉదయం లేవగానే శ్రీకృష్ణుడికి హారతి ఇచ్చి ఆ తర్వాత తమ కార్యక్రమాల్లో మునిగిపోతారు. అలాగే చిన్న పిల్లలకు ప్రత్యేకంగా బోధనలు చేస్తూ ఆధునికత జీవనానికి వ్యతిరేకంగా ఉండగలుగుతారు.

సహజ సిద్ధమైన ఈ జీవనంతో ఒక వ్యక్తి ఎక్కువ కాలం సంతోషంగా జీవించగలుగుతాడని ఇక్కడి వారు చెబుతున్నారు. పచ్చని కొండల మధ్య స్వచ్ఛమైన వాతావరణం లో జీవితం ఉంటే భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు కూడా రావని వీళ్ళు నమ్ముతున్నారు. చాలామంది ఇక్కడి వాతావరణాన్ని చూసి వస్తున్నారని.. ఇక్కడ కొన్ని రోజులు జీవనాన్ని కొనసాగించి వెళ్ళిపోతున్నారని.. అలా వెళ్లిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి శాశ్వతంగా ఉండిపోయిన వారు కూడా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ, ఇతర ఇతర సాంకేతిక కారణాలవల్ల జీవితం కలుషితమయంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛమైన జీవన విధానం ఇక్కడ ఉంటుందని ఈ కూర్మా గ్రామ ప్రజలు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.