ఆ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు.. ఇంతకీ ఎక్కడంటే?

www.mannamweb.com


ప్రజాస్వామ్య ప్రక్రియలో జరిగే ఎన్నికల్లో గెలిచిన పార్టీ అధికారంలో, ఓడిన పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడం సహజమే. ఎంత సానుకూల పవనాలున్నా.. అవి ఎంత తుఫానుగా మారినా..

చట్టసభల్లో ఉన్న అన్ని సీట్లనూ ఒకే పార్టీ గెలుచుకోవడం కష్టం. ప్రత్యర్థులు ఎన్నో కొన్ని సీట్లతో సరిపెట్టుకోవడం పరిపాటి. కానీ మన దేశంలోని ఓ రాష్ట్రంలో ఏకంగా ప్రతిపక్షమన్నదే లేని పరిస్థితి ఏర్పడింది. అతి చిన్న హిమాలయ రాష్ట్రం సిక్కింలో ఇలా జరిగింది. వాస్తవానికి ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్షానికి ప్రజలు ఒకే ఒక్క సీటు ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 32 సీట్లలో అధికార సిక్కిం క్రాంతికారీ మోర్చా (SKM) 31 సీట్లు గెలుచుకోగా, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF) ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఒకరున్నా.. పది మంది ఉన్నా.. అధికారం చేజిక్కించుకునేంత సంఖ్య సంపాదించలేని పార్టీని ప్రతిపక్షంగానే వ్యవహరిస్తాం. రాజ్యాంగం, చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆ చట్ట సభలోని మొత్తం సీట్లలో కనీసం 10 శాతం సీట్లనైనా గెలుచుకుని ఉండాలి. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ కాస్త సంఖ్యను కాంగ్రెస్ పార్టీ సాధించలేకపోవడం వల్లనే ప్రతిపక్ష నేత హోదా అధికారికంగా అందుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో 99 సీట్లు సాధించడంతో రాహుల్ గాంధీ అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా పొందగలిగారు.

ఇక సిక్కిం విషయానికొస్తే.. లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారీ మోర్చా (SKM) అఖండ విజయం సాధించింది. రాష్ట్ర అసెంబ్లీలోని 32 సీట్లలో 2019లో 47.03% ఓట్లతో SKM 17 సీట్లు గెలుచుకోగా, 47.63% ఓట్లు సాధించినప్పటికీ SDF 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ తాజా ఎన్నికల్లో SKM ఏకంగా 58.38% ఓట్లు సాధించి 32 సీట్లకు 31 కైవసం చేసుకుంది. SDF 20.26% ఓట్లకు పరిమితమై చావు తప్పి కన్ను లొట్టపోయిన స్థితిలో ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. ఆ సీటులో గెలిచిన ఎమ్మెల్యే టెంజింగ్ నోర్బు లామ్తా ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్‌ను కలిసి అధికార పక్షంలో చేరిపోయారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 32 సీట్లు అధికారపక్షం చేతికి వచ్చాయి. ఫలితంగా ప్రతిపక్షమే లేకుండా పోయింది.

ప్రజాతీర్పు ప్రకారమే చేరా: టెంజింగ్

సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF)ను వీడి అధికార పార్టీ సిక్కిం క్రాంతికారీ మోర్చా (SKM)లో చేరిన ‘శ్యారీ’ నియోజకవర్గ ఎమ్మెల్యే టెంజింగ్ నోర్బు లామ్తా తాను ప్రజాతీర్పు ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఎన్నికల ఫలితాలను చూస్తే ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, ఆయన పార్టీపై ప్రజలు తిరుగులేని విశ్వాసాన్ని ప్రదర్శించారని కొనియాడారు. ప్రజలు ప్రతిపక్షం అవసరమే లేదని భావించారని, ఫలితాలు కూడా దాదాపు అలాగే వచ్చాయని తెలిపారు. అధికార పార్టీలో చేరాల్సిందిగా తన అభిమానులు, కార్యకర్తలే సూచించారని, వారి అభీష్టం మేరకే చేరానని అన్నారు.

లామ్తా చేరికను సీఎం తమాంగ్ సాదరంగా స్వాగతించారు. లామ్తా తన నియోజకవర్గ అభివృద్ధి గురించి తపన పడుతున్నారని, వాటి గురించి తనతో చర్చించారని అన్నారు. ఆ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామని ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కుంగా నిమా లెప్చాను 1,314 ఓట్లతో ఓడించిన లామ్తా.. అధికారపక్షంలో చేరతారని మొదటి నుంచీ వార్తలొచ్చాయి. అనుకున్నట్టే ఉన్న ఆయనొక్కడూ చేరి, ప్రతిపక్షాన్ని సున్నా (0)గా మర్చేశారు.