మనిషి ప్రాణాన్ని తీసే గుండెపోటు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారిగా కుప్పకూలి పోతుంటాడు.
ఇటీవల ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. యువకులు కూడా గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సంబంధిత సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గడం వల్ల హార్ట్ ఫెయిల్ అవుతుంది.
అయితే గుండెపోటు వచ్చే ముందు శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని త్వరగా గుర్తించగలిగితే ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యను వెంటనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలను నిలబెట్టుకోవచ్చు. ఇంతకీ గుండె సంబంధిత సమస్యలు వచ్చే ముందు శరీరంలో కనిపించే ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఏ రకమైన శ్వాస సంబంధిత సమస్య అయినా గుండె వైఫల్యానికి సంకేతం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లు అనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీర్ఘకాలంగా ఈ సమస్య కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
* గుండెపోటు వచ్చే ముందు కనిపించే మరో ప్రధాన లక్షణాల్లో మోకాళ్లు లేదా చీలమండలలో వాపు ఒకటని నిపుణులు చెబుతున్నారు. గుండె బలహీనంగా మారిన సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. గుండె సరిగ్గా పని చేయని సమయంలో చీలమండలు, మోకాళ్లలో వాపు మొదలవుతుంది.
* ఏ పని చేయకపోయినా తరచూ అలసిపోవడం. నాలుగు అడుగులు వేయగానే ఆయాసం రావడం, అలసటగా ఉండడం వంటి లక్షణాలు కూడా గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు.
* నిరంతరమైన దగ్గు, విపరీతమైన గురక కూడా కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలకు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండె పనితీరు దెబ్బతిన్న సమయంలో, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వంటి కారణాల వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. కాబట్టి పైన తెలిపిన ఏ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.