కొన్నిసార్లు శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పి రావడం సాధారణం.. కొంత సమయం తర్వాత అది దానంతట అదే నయమవుతుంది. ఎందుకంటే ఈ నొప్పి సాధారణంగా తప్పుడు నిద్ర భంగిమ, ఆహారపు అలవాట్లు, జీవనశైలి అలవాట్లు, ఒత్తిడి వంటి వాటి వల్ల వస్తుంది.
కానీ నేటి కాలంలో ప్రజలు తలనొప్పి, ఋతు నొప్పి లేదా చిన్న శరీర నొప్పి వచ్చినప్పుడు వెంటనే మందుల దుకాణం నుంచి నొప్పి నివారణ (పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్) మందులు కొని వెంటనే వేసుకుంటారు.. కానీ ఈ అలవాటు క్రమంగా మీ కాలేయాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా..? అవును పెయిన్ కిల్లర్స్.. ప్రాణాలు తీసే కిల్లర్స్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాస్కులర్ సర్జన్ – వెరికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ సుమిత్ కపాడియా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పెయిన్ కిల్లర్స్ ప్రమాదం గురించి హెచ్చరించారు. నొప్పి నివారణ మాత్ర క్రమంగా అలవాటుగా మారినప్పుడు, కాలేయం దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. కానీ మీ కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఎలాంటి హెచ్చరికలు ఇవ్వదు.. అది ఆగిపోయే వరకు నిశ్శబ్దంగా పనిచేస్తుంది. అటువంటి పరిస్థితిలో, నొప్పి నివారణ మందులు మీ కాలేయాన్ని నెమ్మదిగా ఎలా దెబ్బతీస్తాయో, అది కూడా ఎటువంటి లక్షణాలు లేకుండా.. ఎలా హాని తలపెడతాయి.. అనే విషయాలను తెలుసుకోండి..
కాలేయానికి సైలెంట్ కిల్లర్ ‘పెయిన్ కిల్లర్ మాత్రలు’.. ఎందుకంటే..
– మీరు సూచించిన మోతాదు కంటే కొంచెం ఎక్కువ మందు తీసుకుంటే.. అది కాలేయానికి చాలా హానికరం. ముఖ్యంగా పారాసెటమాల్ అధిక మోతాదు మీ కాలేయానికి ప్రమాదకరం.
– క్రమం తప్పకుండా నొప్పి నివారణ మందులు తీసుకోవడం వల్ల కాలేయ ఎంజైమ్‌లు పెరిగే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల లక్షణాలు లేకపోయినా కాలేయం దెబ్బతింటుంది.
– ఇబుప్రోఫెన్ వంటి NSAIDలు కాలేయ వాపును పెంచుతాయి.. కొవ్వు కాలేయాన్ని (ఫ్యాటీ లివర్) మరింత దిగజార్చుతాయి.. దీని ఫలితంగా కాలేయ వైఫల్యం, మార్పిడి జరగవచ్చు.
– ఆల్కహాల్ తాగిన తర్వాత పెయిన్ కిల్లర్ (నొప్పి నివారిణి) తీసుకుంటే, ఇది సాధారణంగా హ్యాంగోవర్ వల్ల వచ్చే తలనొప్పికి ఉపయోగించబడుతుంది. ఇది మీకు రిలాక్స్‌గా అనిపించవచ్చు కానీ ఇది కాలేయానికి విషపూరిత కలయిక..
– వైద్యుడి సలహా లేకుండా ఎక్కువ కాలం మందు తీసుకుంటే, కాలేయం శాశ్వతంగా దెబ్బతింటుంది.
మందులు కాలేయానికి హాని కలిగించకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
- నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే ఔషధం తీసుకోండి
- సూచించిన మొత్తం కంటే ఎక్కువ మోతాదును ఎప్పుడూ తీసుకోకండి
- పదే పదే తీసుకుంటుంటే వైద్యుడిని సంప్రదించండి.
































