పక్షవాతం వచ్చే ముందు శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..

జీవితంలో ప్రతి క్షణం విలువైనదే అని పెద్దలు చెబుతుంటారు.. కానీ పక్షవాతం దగ్గరకి వస్తే అది ప్రాణాంతకమైన క్షణమవుతుంది. శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను చాలా మంది పట్టించుకోరు.


అవే తర్వాత పెద్ద ప్రమాదానికి దారి తీస్తాయి. పక్షవాతం అంటే ఒక్కసారిగా పడిపోవడమే కాదు.. అది ముందుగానే హెచ్చరికలు ఇస్తుంది. వాటిని గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు, శాశ్వత అంగవైకల్యం నుంచి తప్పించుకోవచ్చు. పక్షవాతం లేదా స్ట్రోక్ అనేది ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను బలితీస్తున్న సైలెంట్ కిల్లర్. ఒకసారి అటాక్ వస్తే, సరైన సమయానికి చికిత్స అందకపోతే దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. అందుకే డాక్టర్లు చెబుతున్న ఒకే మాట సంకేతాలను గుర్తించండి.. వెంటనే చర్య తీసుకోండి.

పక్షవాతం అంటే ఏమిటి:
పక్షవాతం అంటే మెదడులోని ఒక భాగానికి రక్తప్రసరణ ఆగిపోవడం లేదా బాగా తగ్గిపోవడం. రక్తం అందకపోవడం వల్ల ఆక్సిజన్‌ లేకుండా మెదడులోని సెల్స్ చనిపోతాయి. ఆ భాగం నియంత్రించే శరీర ఫంక్షన్లు ఒక్కసారిగా పని చేయడం ఆగిపోతుంది. ఫలితంగా మాట్లాడడం కష్టంగా మారడం, శరీరంలోని ఒక వైపు బలహీనపడడం, సడన్‌గా పడిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. స్ట్రోక్ రెండు ప్రధాన రకాలుగా ఉంటుంది రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే ఇస్కీమిక్ స్ట్రోక్, రక్తనాళం పగిలిపోవడం వల్ల వచ్చే హెమరేజిక్ స్ట్రోక్. రెండూ సీరియస్ స్థితులే. అందుకే ఒక క్షణం కూడా వృథా చేయకూడదు.

వచ్చే ముందు శరీరం ఇచ్చే సంకేతాలు:
పక్షవాతం ఒక్కసారిగా సంభవించినట్టే కనిపించినా.. అది వచ్చే ముందు శరీరం మెల్లగా సంకేతాలు ఇస్తుంది. భరించలేని తలనొప్పి, కళ్లు మసకబారడం లేదా డబుల్ విజన్ రావడం, ముఖం లేదా శరీరంలోని ఒక వైపు తిమ్మిరి రావడం, మొద్దుబారడం మొదటి సంకేతాలు. మాట్లాడటంలో తడబాటు, ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోవడం, నడవడంలో ఇబ్బంది పడటం, ముఖంలో ఒక వైపు కిందికి జారినట్లు అనిపించడం కూడా ప్రధాన హెచ్చరికలు. ఈ సంకేతాలు కొన్నిసార్లు కొన్ని నిమిషాలకే మాయం అయిపోతాయి. చాలామంది దాన్ని లైట్‌గా తీసుకుంటారు. కానీ అదే పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. వీటిని విస్మరించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరణానికి దారితీసే బ్రెయిన్ ఎన్యూరిజం:
కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు కేవలం స్ట్రోక్‌ మాత్రమే కాకుండా మరింత తీవ్రమైన పరిస్థితికి.. మెదడులో రక్తనాళం ఉబ్బి చిట్లిపోవడానికి సంకేతాలు కావచ్చు. దీన్ని బ్రెయిన్ ఎన్యూరిజం అంటారు. ఒకసారి ఇది చిట్లిపోతే మెదడులో తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది. ఒక్కసారిగా భరించలేని తలనొప్పి, మెడ పట్టేయడం, చూపు మందగించడం లాంటి లక్షణాలు వస్తాయి. ఈ దశలో కొన్ని నిమిషాల ఆలస్యం కూడా ప్రాణాంతకం అవుతుంది.

‘గోల్డెన్ అవర్’లో చికిత్సే ప్రాణరక్షణ:
స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి గంటనే గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో చికిత్స ప్రారంభిస్తే ప్రాణాలు కాపాడటమే కాకుండా అంగవైకల్యాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు. సంకేతాలు గుర్తు పట్టడానికి వైద్య నిపుణులు FAST పద్ధతిని సూచిస్తున్నారు.

F (Face) – ముఖం ఒక వైపు జారుతుంటే గమనించండి.
A (Arm) – ఒక చేయి బలహీనమైందా గమనించండి.
S (Speech) – మాట్లాడటంలో తడబాటు ఉందా గమనించండి.
T (Time) – వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయండి.
ఈ నాలుగు స్టెప్స్ ద్వారా స్ట్రోక్‌ను వెంటనే గుర్తించి చర్య తీసుకోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడబడ్డాయి.

నివారణే రక్షణ:
పక్షవాతం వచ్చే అవకాశాలను తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. రక్తపోటు, కొలెస్ట్రాల్, షుగర్‌లను కంట్రోల్‌లో ఉంచడం అత్యవసరం. ధూమపానం పూర్తిగా మానేయాలి. పోషకాహారం తీసుకోవడం, ప్రతిరోజూ శారీరక వ్యాయామం చేయడం, మితంగా మద్యం సేవించడం, స్ట్రెస్‌ను నియంత్రించుకోవడం వంటి జీవనశైలి మార్పులు స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. నిపుణులు చెబుతున్న ఒకే మాట.. శరీరం ఇచ్చే హెచ్చరికలను ఎప్పుడూ లైట్‌గా తీసుకోవద్దు. ఒక్క నిమిషం ఆలస్యం ప్రాణాంతకం కావచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.