దేశవ్యాప్తంగా విమానాశ్రయాల సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చుట్టుముట్టిన గ్రామాలు, పట్టణాల్లో భూముల ధరలు ఆశ్చర్యకరమైన రీతిలో పెరిగినట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
కరోనా తర్వాతి కాలంలో – అంటే 2021 నుంచి 2025 మధ్య – ఈ పెరుగుదల మరింత వేగంగా నమోదైందని నివేదికలు చెబుతున్నాయి. విమానాశ్రయానికి 50 కిలోమీటర్ల పరిధిలో డిమాండ్ కొనసాగుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
2000కు ముందు వందల్లో.. ఇప్పుడెంతో పైకి..
విమానాశ్రయం అభివృద్ధికి ముందు, శంషాబాద్ పరిధిలో భూముల రేట్లు చాలా తక్కువగా ఉండేవి. 1990ల చివరలో చదరపు గజం ధర రూ.500లోపే ఉండేదని అప్పటి రియల్ ఎస్టేట్ డీలర్లు చెబుతున్నారు. కానీ ఇప్పుడీ ప్రాంతం పూర్తిగా మారు రూపం దాల్చింది. శంషాబాద్, బుద్వేల్, సాతంరాయి, మామిడిపల్లి, తుక్కుగూడ వంటి ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్టులు భారీగా నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ విమానాశ్రయానికి 25-50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి.
ఎలా పెరిగాయి ధరలు.?
రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ స్క్వేర్వార్డ్స్ ప్రకారం, గత ఐదేళ్లలో విమానాశ్రయం సమీప భూగర్భాలు సగటున 74 శాతం ధరల పెరుగుదలను చవిచూశాయి. అపార్ట్‌మెంట్ల ధరలు చదరపు అడుగుకు రూ.6,000 నుంచి రూ.8,000 మధ్యగా ఉండగా, ఇతర ప్రముఖ ప్రాంతాల్లో అదే చదరపు అడుగు ధర రూ.9,000 నుంచి రూ.11,000 వరకు ఉంది. స్థలాల విషయంలో చూస్తే, విమానాశ్రయం సమీపంలో చదరపు గజం ధరలు రూ.55,000 నుంచి రూ.60,000 మధ్య ఉన్నాయి. అదే సమయంలో ఇతర నగర ప్రాంతాల్లో ఇవే రేట్లు రూ.75,000 నుంచి రూ.80,000 వరకు వెళుతున్నాయి.
శంషాబాద్ పరిధిలో భవిష్యత్తు!
వాస్తవానికి ఇప్పటివరకు శంషాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి ఆశించిన స్థాయికి చేరలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీవో 111 పరిమితులు, పరిశ్రమలు లేకపోవడం వంటి కారణాలు ప్రధానమైనవని వారు చెబుతున్నారు. అయినప్పటికీ, గత నాలుగైదేళ్లుగా దక్షిణ హైదరాబాద్ వైపు అభివృద్ధి బాగా ఊపందుకుంది. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో ఎకరం స్థలానికి రూ.4 కోట్లు పలుకుతుండగా, ఇంకా కొన్ని ప్రాంతాల్లో చదరపు గజం రూ.5,000 నుంచి రూ.10,000 మధ్యలో దొరికే అవకాశముంది. విల్లాల ధరలు రూ.కోటికి పైగానే ఉంటున్నాయి.
అభివృద్ధి పై స్పెషల్ ఫోకస్..
ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా శంషాబాద్, తుక్కుగూడ, మహేశ్వరం ప్రాంతాల్లో మౌలిక వసతుల విస్తరణకు ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. నాగోల్ నుంచి ఆరంఘర్ మీదుగా విమానాశ్రయం వరకు మెట్రో రైలు విస్తరణ (లైన్ 2ఏ) ప్రతిపాదించబడింది. రాజేంద్రనగర్‌లో కొత్త హైకోర్టు భవనం నిర్మాణం జరుగుతోంది. శ్రీశైలం-నాగార్జునసాగర్ రహదారుల మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగనుంది, ఇది విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ యోచనలో ఉంది. మహేశ్వరం పారిశ్రామిక హబ్‌గా మారుతోంది. ఇటీవల ఓ జ్యువెలరీ తయారీ యూనిట్‌కు సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరిగింది.
విమానాశ్రయం చుట్టూ రియల్ భూమ్..
పలు బడా నిర్మాణ సంస్థలు రిటైర్మెంట్ హోమ్స్, టౌన్షిప్‌లు నిర్మించేందుకు భూముల సేకరణ చేపట్టాయి. ఇప్పటికే పలు విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రాంతీయ వలయ రహదారి (RRR) పూర్తయ్యే దశలో ఉండటంతో, శంషాబాద్ పరిధి రాబోయే కాలంలో భారీగా అభివృద్ధి చెందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.




































