సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అధికారులు ఎన్ని రకాలుగా అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు చేపడుతున్నా నేరాలు మాత్రం తగ్గడం లేదు. ప్రజల భయాన్నో, అత్యాశనో ఆసరగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఇలాంటి ఓ ఘటనే బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఓ 77 ఏళ్ల మహిళ ఏకంగా రూ. 12 కోట్లు కోల్పోయింది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన లక్ష్మీ శివకుమార్ అనే 77 ఏళ్ల మహిళకు టెలికాం శాఖ అధికారుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. తన పేరుతో ఉన్న సిమ్ కార్డ్‌ను ఉపయోగించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫోన్‌లో వివరించారు. దీంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కంప్లైంట్ అందినట్లు ఫోన్‌లో సైబర్ నేరస్థులు చెప్పుకొచ్చారు.
మీ సిమ్ కార్డును ఉపయోగించే మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు వెంటనే బ్యాంక్ ఖాతాలు, ఇన్వెస్ట్మెంట్ వివరాలను ఇవ్వాలని లేదంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా నకిలీ ఎఫ్‌ఐఆర్ డాక్యుమెంట్‌తో పాటు సుప్రీం కోర్టు జారీ చేసినట్లు ఉన్న నకిలీ అరెస్ట్ వారెంట్‌ను కూడా ఫోన్‌కు పంపించారు. దీంతో ఆమె ఇదంతా నిజమే అనుకుంది. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే వెంటనే డబ్బులు చెల్లించాలని తెలిపారు. దీంతో భయపడిపోయిన ఆమె వెనకా ముందు ఆలోచించకుండా ఏకంగా రూ. 12 కోట్లు చెల్లించేసింది. ఆ తర్వాత వెంటే వారికి వృద్దురాలికి కనెక్షన్ కట్ అయిపోయింది. తిరిగి మాట్లాడేందుకు కాల్ చేసినా ఫలితం దక్కలేదు. చివిరికి, తాను మోసపోయినట్టు తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది.
సైబర్ నేరస్థులు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. మీరు ఏ తప్పు చేయని నేపథ్యంలో ఎవరికీ భయపడాల్సి అవసరం లేదని గుర్తు పెట్టుకోండి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఇతరులతో పంచుకోకూడదు. ఎవరైనా ఇలాంటి కాల్స్‌చేస్తే వెంటనే పోలీసులను సంప్రదించడం ఉత్తమమని సూచిస్తున్నారు.