ముఖంలో కనిపించే ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం.. ఇది హార్ట్ ఎటాక్ సంకేతం కావచ్చు

ప్రస్తుత కాలంలో గుండెపోటు అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరినీ భయపెడుతోంది. చిన్న వయసులోనే ఎందరో ఆకస్మికంగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు మనం తరచుగా చూస్తున్నాం.


జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి ఇవన్నీ గుండెకు ప్రమాదం పెంచుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో గుండెపోటు ముందు నుంచి వచ్చే కొన్ని సంకేతాలను అస్సలు విస్మరించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ముఖంపై కనపడే కొన్ని లక్షణాలు ప్రాణాలు నిలిపే సంకేతాలు అవుతాయని చెబుతున్నారు.

సాధారణంగా గుండెపోటు అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది.. ఛాతీ నొప్పి. కానీ, ఇది మాత్రమే కాకుండా పలు విభిన్నమైన లక్షణాలు కూడా గుండెపోటుకు సంకేతం కావచ్చు. పంటి నొప్పి కూడా అదే కోవలోనిది. సాధారణంగా పంటి నొప్పి అంటే మనం దంత సంబంధిత సమస్యలుగా భావిస్తాం. కానీ ఇది గుండెపోటుకు ముందస్తు సంకేతం కూడా కావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గుండెకు సంబంధించిన నాడులు దవడ, పళ్ళ వరకు విస్తరించి ఉండటమే దీనికి కారణం. అందువల్ల పంటి నొప్పి పెద్దగా ఏ కారణం లేకుండా ఎక్కువసేపు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు.

ఇక చిగుళ్ల నుంచి రక్తస్రావం కూడా చాలా మందికి సాధారణమే అనిపిస్తుంది. కానీ ఇది తరచూ జరిగితే గుండెపోటుకు ముందు వచ్చే సంకేతం కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. నోటి పూతలు సైతం జీర్ణ సంబంధ సమస్యలతో మాత్రమే కాకుండా గుండె సంబంధిత సమస్యలతో కూడా సంబంధం ఉంటాయని గుర్తించారు. దీర్ఘకాలికంగా నోటి పూతలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

దవడ నొప్పి కూడా అలాగే. దవడ వద్ద ఎడమ వైపు నొప్పి ఎక్కువగా ఉంటే అది హార్ట్ ఎటాక్ ముందస్తు సూచన కావచ్చు. ఛాతీ నొప్పితో పాటు దవడకు వచ్చే నొప్పి గుండెకు రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడానికి సంకేతం అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ లక్షణాలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎక్కువగా చెమటలు రావడం, అసహనం, వికారం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని వైద్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.

స్త్రీల విషయానికి వస్తే గుండెపోటు లక్షణాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఛాతీ నొప్పితో పాటు ఎక్కువ అలసట, నిద్రలేమి, మెడ, భుజాలు, వెన్ను, పొత్తికడుపు వరకు వ్యాప్తి చెందే నొప్పులు కలగవచ్చు. వీటిని చాలా మంది సాదారణ సమస్యలుగా తీసుకుంటారు. కానీ ఇవి గుండెకు సంబంధించిన సంకేతాలే కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

సంక్షిప్తంగా చెప్పాలంటే.. మనం ముఖంపై కనిపించే చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో డాక్టర్‌ను సంప్రదిస్తే గుండెపోటు అనే ముప్పును తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యం ఉంటేనే ఆనందం ఉంటుందని గుర్తుంచుకుని.. చిన్న సమస్యలకైనా వైద్య సలహా తీసుకోవడం అందరికీ అవసరమే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.