మ‌ద్యం ప్రియులు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం ఇది

www.mannamweb.com


మీరు మ‌ద్య‌పాన ప్రియులా.. రోజూ విప‌రీతంగా మ‌ద్యం సేవిస్తుంటారా.. లేదా ఎప్పుడో ఒక‌సారి ఒక రెండు పెగ్గుల మందు పుచ్చుకుంటారా.. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది మీకోస‌మే. అవును, ఎందుకంటే.. ఎప్పుడో ఒక‌సారి రెండు పెగ్గులు అయితే ఏమీ కాదు, ఆరోగ్యానికి మంచిదేన‌ని చాలా మంది అంటుంటారు. ఆమాట‌కొస్తే డాక్ట‌ర్లు సైతం ఇవే విష‌యాల‌ను చెబుతుంటారు. అయితే వాస్త‌వంగా చెప్పాలంటే ఆల్క‌హాల్ అనేది చిన్న డ్రాప్ తాగినా, అది కూడా ఎప్పుడో ఒక‌సారి తాగినా కూడా మ‌న‌కు న‌ష్ట‌మే క‌లుగుతుంద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ మేర‌కు సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.

స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు చెందిన యూనివ‌ర్సిడాడ్ ఆటోనోమా డి మాడ్రిడ్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ రొజారియో ఒర్టొలా తన బృందంతో క‌లిసి 12 ఏళ్ల పాటు ఓ అధ్య‌య‌నం చేప‌ట్టారు. అందులో భాగంగా బ్రిట‌న్‌కు చెందిన 1,35,103 మంది వ్య‌క్తుల ఆరోగ్య వివ‌రాల‌ను వారు సేక‌రించారు. అంద‌రి వ‌య‌స్సు సుమారుగా 60 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. అయితే అంద‌రి విష‌యాలను సేక‌రించి అధ్య‌య‌నం చేసిన త‌రువాత తేలిందేమిటంటే.. ఆల్క‌హాల్‌ను చాలా త‌క్కువ‌గా తాగినా కూడా ప్ర‌మాద‌క‌ర‌మేన‌ని వెల్ల‌డైంది.

ఎప్పుడో ఒక‌సారి అయినా ప్ర‌మాద‌మేన‌ట‌..

చాలా మంది ఎప్పుడో ఒక‌సారి అని చెప్పి లేదా వారంలో ఒక‌సారి, నెల‌కు ఒక‌సారి ఒక రెండు పెగ్గులు మందు తాగుతారు. అయితే వాస్త‌వానికి ఇలా తాగినా కూడా మ‌న ఆరోగ్యానికి తీవ్రంగానే హాని జ‌రుగుతుంద‌ని స‌ద‌రు సైంటిస్టులు చెబుతున్నారు. ఇలా మ‌ద్యం సేవించినా కూడా క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం చాలా వ‌ర‌కు ఉంటుంద‌ని, ఇక రోజూ మ‌ద్యం సేవించే వారికి అయితే క్యాన్స‌ర్ చాలా త్వ‌ర‌గా వ‌స్తుంద‌ని, అలాగే వారు చాలా త్వ‌ర‌గా చ‌నిపోయే అవ‌కాశాలు కూడా ఉంటాయ‌ని చెప్పారు.

క‌నుక మ‌ద్యం సేవించ‌డం అన్న‌ది ఆరోగ్యానికి హానిక‌రం అని వారు అంటున్నారు. అది చిన్న మోతాదు అయినా స‌రే అస‌లు తాగ‌కూడ‌ద‌ని వారు సూచిస్తున్నారు. మ‌ద్యం సేవించ‌డానికి బ‌దులుగా పండ్లను తిన‌డం అల‌వాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని, అలాగే ఆయుర్దాయం కూడా పెరుగుతుంద‌ని అంటున్నారు. క‌నుక మ‌ద్యం ప్రియులు ఆ విధంగా చేస్తే మంచిది. లేదంటే అన‌వ‌స‌రంగా రోగాల‌ను కొని తెచ్చుకున్న వారు అవుతారు.