కాబూల్ (ఆఫ్ఘనిస్తాన్) నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానం టైర్ల భాగంలో కూర్చుని ఒక 13 ఏళ్ల బాలుడు సుమారు 1000 కిలోమీటర్లు ప్రమాదకరమైన ప్రయాణం చేయడం దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది.
RQ4401 విమానంలో జరిగిన ఈ అనూహ్య ఘటన భద్రతా లోపాలను, యువతలో సాహసం పేరిట పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని మరోసారి ఎత్తిచూపింది.
ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన విమానం టైర్ల వద్ద బాలుడు కూర్చున్నట్లు గుర్తించబడింది. ఇరాన్‌కు పారిపోయే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
ఎందుకు ఇలా చేశాడు?
అధికారులు బాలుడిని ప్రశ్నించగా.. తన సాహసానికి ఎలాంటి ప్రత్యేక కారణం లేదని, కేవలం “విమానంలో టైర్ల వద్ద కూర్చుంటే ఎలా ఉంటుందో” అనే తీవ్రమైన ‘కుతూహలం’ కారణంగానే ఈ ప్రమాదకరమైన పని చేశానని తెలిపాడు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను తనతో పాటు ఒక చిన్న ఆడియో స్పీకర్‌ను కూడా తీసుకువచ్చాడు.
* ప్రాణాల మీదకు తెచ్చిన సాహసం
విమానాలు ఎక్కువ ఎత్తులో ప్రయాణించేటప్పుడు టైర్ల భాగంలో గాలి పీడనం తక్కువగా ఉండటం, విపరీతమైన చలి (ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం), ఆక్సిజన్ కొరత ఏర్పడటం వంటి కారణాల వల్ల ఇలాంటి ప్రయాణాలు ప్రాణాంతకం. అయినప్పటికీ, అంత దూరం ప్రయాణించిన బాలుడు సురక్షితంగా ఢిల్లీకి చేరుకోవడం అధికారులు, నిపుణులను ఆశ్చర్యపరిచింది. అతని అదృష్టాన్ని వారు కొనియాడారు.
భద్రతపై ప్రశ్నలు
ఈ సంఘటన విమానాశ్రయ భద్రతా వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఇంతటి ముఖ్యమైన, ప్రమాదకరమైన భాగంలోకి ఒక బాలుడు ఎలా ప్రవేశించగలిగాడు? భద్రతా వ్యవస్థలో జరిగిన లోపంపై భారత అధికారులు.. అంతర్జాతీయ సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి.
బాలుడికి ఉన్న అపారమైన కుతూహలం కారణంగా ఈ సాహసం చేసినప్పటికీ, ఈ ఘటన ‘కుతూహలం’ ఎంత ఉన్నా ప్రాణాలతో ఆటలు ఆడకూడదనే విషయాన్ని మరోసారి గట్టిగా గుర్తుచేస్తోంది. యువతలో సాహసం, ఉత్సుకత పేరుతో చేసే ఇలాంటి ప్రమాదకరమైన చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
































