విజయవాడ మునిగిపోవడానికి అసలు కారణం ఇదే..! ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా

www.mannamweb.com


మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇక తాజాగా కురిసిన వర్షాలతో బెజవాడ జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. కాలనీలకు కాలనీలే నీటిలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది జనాలు రోడ్డున పడ్డారు. రెండు రోజులుగా తిండి, నీరు లేక.. ఆదుకునే వారు లేక ఇళ్లను వదిలి బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. చరిత్రలో ఎన్నడు చూడనంత భారీ వర్షాలు, వరదలతో వారు ఇబ్బంది పడుతున్నారు. బెజవాడలో కనిపించే దృశ్యాలు చూస్తే.. కడుపు తరుక్కుపోతుంది. మరి విజయవాడకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి.. అంటే..

విజయవాడ నగరం మధ్యలోంచి ప్రవహిస్తున్న బుడమేరు నదే ఇప్పుడు ఆ పట్టణానికి శాపంగా మారింది అంటున్నారు నిపుణులు. గత కొంత కాలంగా బుడమేరులో తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఆక్రమణలే ముంపునకు కారణంగా చెప్పొచ్చు అంటున్నారు. బుడమేరు.. ఖమ్మం జిల్లాలో పుట్టి ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో 170 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీళ్లందించే ప్రధాన నీటి వనరుల్లో ఒకటి.
2005లో ఇలానే..

విజయవాడ నగరం పక్క నుండి ప్రవహించే కృష్ణా నది కన్నా.. నగరం మధ్య నుండి ప్రవహించే బుడమేరు వల్లే విజయవాడకు ఎక్కువ ముప్పు ఉందని ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు నిపుణులు. తాజా వర్షాలతో అది మరోకసారి నిరూపితం అయ్యింది. సాధారణంగా బుడమేరు వర్షాకాల గరిష్ట ప్రవాహం 11 వేల క్యూసెక్కులు మాత్రమే. అయితే గతంలో అనగా 2005 సంవత్సరంలో 70 వేల క్యూసెక్కులు ప్రవహించడంతో తొలిసారి బెజవాడ నీట మునిగింది.

దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగగా.. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు చేపట్టింది. దీన్ని ప్రారంభించి సుమారు 20 ఏళ్లు కావొస్తున్నా.. కానీ అది ఇంకా పూర్తి కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు బుడమేరు మొత్తం ఆక్రమణలతో నిండిపోయింది. ఆపరేషన్ కొల్లేరు పూర్తిగా పక్కదారి పట్టింది.

పోలవరం ప్రాజెక్టులో భాగంగా 2007–2008లో పోలవరం కుడికాల్వలోకి బుడమేరు ప్రవాహాన్ని మళ్లించారు. అయితే కృష్ణా నది ఎగువ నుండి వరద కొనసాగినప్పుడు అందులో బుడమేరు నీటి ప్రవాహం చేరే అవకాశం లేదు. బుడమేరును పోలవరం కుడికాల్వలో కలిపినా ఆ కాల్వ గరిష్ట ప్రవాహం 37,500 క్యూసెక్కులు కావడం, బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వలు ఏర్పాటు చేయక పోవడం గమనార్హం. బుడమేరుకు వస్తున్న అత్యధిక వరద మొత్తం కొల్లేరులో కలవాలి. కానీ, వరద ఎక్కడికక్కడ పోటెత్తింది.

2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు ఆ తర్వాత అటకెక్కాయి. బుడమేరు విజయవాడ పట్టణంలోకి రాకుండా నిర్మించిన కరకట్టను ధ్వంసం చేస్తూ నిర్మాణాలు కొనసాగాయి. రాష్ట్రం రెండుగా విడిపోయాక విజయవాడ నగరంలో కొత్త కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. ఈ 20 ఏళ్లలో జరిగిన నిర్మాణాల మూలంగా కనీసం బుడమేరు కరకట్ట ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. దీంతో 20 నిర్లక్ష్యానికి ఫలితంగా తాజా వరదల మూలంగా విజయవాడ మరోసారి నీట మునిగింది. ఇప్పటికైనా కన్ను తెరవకపోతే భవిష్యత్తులో ఇది మరిన్ని ప్రమాదాలకు దారి తీస్తుంది అంటున్నారు నిపుణులు.