55 ఏళ్ళ వయసులోనూ మాధవన్ ముఖంపై ముడతలు లేకపోవడానికి రహస్యం ఇదే

55 ఏళ్ల వయస్సులోనూ మాధవన్ ముఖంపై ముడతలు ఎందుకు లేవు? చర్మ సంరక్షణకు ఆయన ఎలాంటి టిప్స్ పాటిస్తారు? అన్నం గురించి ఆయన ఏం మాట్లాడారు? ఇక్కడ తెలుసుకోండి.

నటుడు ఆర్. మాధవన్ 55 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ చాలా యంగ్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తారు. ఇందుకోసం ఆయన ఎలాంటి చికిత్సలు తీసుకోలేదట. వేయించిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, అలాగే కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు, ఎండ, శాకాహార భోజనం మాత్రమే తన అందం వెనుక ఉన్న రహస్యమని చెబుతున్నారు.


ఆరోగ్యకరమైన చర్మం అంటే కేవలం చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడటమే కాదు.. లైఫ్‌స్టైల్ కూడా కీలకమని మాధవన్ అంటున్నారు. ముడతలు, చర్మ సమస్యలు రాకుండా ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవడం ముఖ్యమే అయినా, ఎండను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు. జూలై 7న జీక్యూ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన చర్మ సంరక్షణ అలవాట్ల గురించి మాట్లాడారు. జూన్ 1న మాధవన్ 55వ ఏట అడుగుపెట్టారు.

మాధవన్ చర్మ రహస్యాలు: కొబ్బరి నూనె నుంచి ఎండ వరకు

మితంగా ఎండ తగలడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయి. మానసిక స్థితి మెరుగుపడుతుంది. మాధవన్ కూడా ఎండకు పెద్ద అభిమానే. తన చర్మం ‘గట్టిగా, ముడతలు లేకుండా’ ఉండటానికి ఎండే కారణమని ఆయన చెబుతున్నారు. ‘కొబ్బరి నీళ్లు, ఎండ, శాకాహారం’ తన యవ్వనానికి కారణమని, 50 ఏళ్లు దాటినా యంగ్‌గా కనిపించడానికి ఇవే సాయం చేస్తున్నాయని ఆయన గట్టిగా నమ్ముతారు.

“నేను ఉదయాన్నే సూర్యరశ్మిలో గోల్ఫ్ ఆడతాను. చర్మం కొద్దిగా నల్లబడుతుంది కానీ, అది చర్మాన్ని బిగుతుగా ఉంచడానికి, ముడతలు లేకుండా చేయడానికి సాయం చేస్తుంది. ఎండ నాకు బాగా పడుతుంది. నేను ఎలాంటి ఫిల్లర్స్ (fillers) గానీ, ఇతర బ్యూటీ ట్రీట్‌మెంట్స్ గానీ చేయించుకోలేదు. అప్పుడప్పుడు ఏదైనా సినిమా పాత్ర కోసం ఫేషియల్ చేయించుకుంటాను అంతే. కేవలం కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు, ఎండ, శాకాహారం మాత్రమే నా చర్మాన్ని ఇంత బాగా ఉంచుతున్నాయి” అని చెప్పుకొచ్చారు.

‘బియ్యం గురించి అంత గోల నాకు అర్థం కాదు’

ప్రాసెస్ చేసిన ఆహారంతో పోలిస్తే, తాజాగా వండిన ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ‘పప్పు, కూర, అన్నం లాంటి సింపుల్ భోజనం’ తినడం తన ఫిట్‌నెస్‌కు, ఆరోగ్యానికి మరో ముఖ్యమైన రహస్యమని మాధవన్ చెబుతున్నారు. తన శరీరం చెప్పేది వినడం, ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోవడం, వేయించిన పదార్థాలు, ఆల్కహాల్‌ను పరిమితం చేయడం వంటివి కూడా మాధవన్ ఇతర చిట్కాలు.

“నా చిన్నతనంలో మా ఇంట్లో ఫ్రిజ్ ఉండేది కాదు. కాబట్టి ఆహారాన్ని ఎప్పుడూ తాజాగా వండుకోవాల్సి వచ్చేది. ఆ అలవాటు అలాగే ఉండిపోయింది. అందుకే నాకు ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసినవి, మళ్ళీ వేడి చేసిన వంటలు లేదా సీజన్ కాని పండ్లు పడవు. నేను షూటింగ్‌లో ఉన్నప్పుడు కూడా పప్పు, కూర, అన్నం లాంటి సింపుల్ భోజనం వండటానికి నా చెఫ్‌ని తీసుకెళ్తాను. బియ్యం గురించి అంత గోల నాకు అర్థం కాదు. మా తాత, నానమ్మలు 92, 93 ఏళ్ళ వరకు జీవించారు. వాళ్ళు రోజుకు మూడుసార్లు అన్నం తినేవారు. నేను నా శరీరం చెప్పేది వింటాను. నాకు నచ్చిన ఆరోగ్యకరమైన ఆహారానికే కట్టుబడి ఉంటాను. వేయించిన పదార్థాలు, ఆల్కహాల్‌ను ఎంత వీలైతే అంత తగ్గిస్తాను. నాకు ఆకలేసినప్పుడే తింటాను. .సమయాన్ని బట్టి కాదు. ఇది నన్ను అలెర్ట్‌గా, సంతోషంగా, యంగ్‌గా ఉంచుతుంది.” అని వివరించారు.

(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్ సలహా తీసుకోండి.)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.