భగవంతుడి సన్నిధికి వెళ్లినపుడు కళ్లారా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత కాసేపు ఆలయ ఆవరణలో కూర్చుంటారు. ఆ సమయంలో మన జీవిత సారాంశాన్ని తెలియజేసే శ్లోకాన్ని పఠించాలని గ్రంధాల్లో స్పష్టంగా ఉంది.
ఈ శ్లోకాన్ని పఠించడం, దాని అర్థం తెలుసుకోవడం వల్ల మిమ్మల్ని కలవరపర్చే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
అనాయాసేన మరణం, బినా దేన్యేన జీవనం
దేహంత్ తవ సానిధ్యం, దేహి మే పరమేశ్వరం
ఈ శ్లోకంలో ఎంత అర్థం ఉందో తెలుసా..
“అనాయాసేన మరణం”
మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖంగా చనిపోవాలి. ఎప్పుడూ అనారోగ్యం బారిన పడకుండా మంచానికి పరిమితం కాకుండా, బాధతో కాకుండా రోజువారీ జీవితాన్ని గడిపుతూనే కన్నుమూయాలి
“బినా దేన్యేన జీవనం”
ఎవరిపైనా ఆధారపడే జీవితాన్ని ఇవ్వకు.ఎవ్వరినీ ఆశ్రయించే పరిస్థితి కల్పించకు. ఎవరి దయకోసం ఎదురుచూసే పరిస్థితిని ఇవ్వకు. సహాయం కోసం ఇతరులను వేడుకోకుండా జీవితానికి ముగింపును ఇవ్వు
“దేహంతే తవ సానిధ్యం”
మరణం ఎప్పుడు వచ్చినా కానీ అధి భగవంతుడి సన్నిధిలోనే జరగాలి. భీష్మ పితామహుడి మరణం సమయంలోనూ శ్రీకృష్ణుడు స్వయంగా ఆయన ముందు నిలబడ్డాడు. అలా ఆయన దైవ దర్శనాన్ని చేసుకుని భగవంతుడి సన్నిధిలోనే ప్రాణాలు విడిచిపెట్టాడు. నాక్కూడా అలాంటి మరణాన్ని ప్రసాదించు అని అర్థం.
“దేహి మే పరమేశ్వరం”
ఓ భగవంతుడా మాకు అలాంటి వరాన్ని ఇవ్వు అని అర్థం
ఆలయంలో కూర్చున్న ఆ కొన్ని నిముషాలు ఈ శ్లోకాన్ని భక్తిపూర్వకంగా పఠించాలి.
భగవంతుడిని ఏమీ ప్రత్యేకంగా కోరుకోవద్దు..మీకు ఏం ఇస్తే మంచి జరుగుతుందో భగవంతుడికి తెలుసు. మనం పొందేది అయినా కోల్పోయేది అయినా ప్రతిదీ మన కర్మఫలమే. అందుకే గుడిలో దర్శనం తర్వాత కూర్చుని ప్రార్థన చేయాలి కానీ అది కావాలి, ఇది కావాలని అని కోర్కెల చిట్టాను విప్పకూడదు.
‘ప్రార్థన’
ప్ర అంటే ప్రత్యేకమైనది, అత్యంత ఉత్తమమైనది అని అర్థం
అర్థన అడగడం, అభ్యర్థించడం
ప్రత్యేకమైన అత్యున్నత అభ్యర్థన అని అర్థం
ఆలయంలో ఉన్న ఆ కొద్ది నిముషాలు భగవంతుడి ఎదురుగా నిల్చుని కళ్లు మూసుకోవద్దు. కళ్ల నిండుగా భగవంతుడిని చూడండి. పరమాత్ముడి దర్శనానికి వచ్చి కళ్లు మూసుకోవడం ఎందుకు..నిజరూపాన్ని చూడండి, దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకోండి, ఆ రూపాన్ని కళ్లలో నింపుకోవాలి.
దర్శనం తర్వాత ప్రశాంతంగా కాసేపు కూర్చుని అప్పుడు కళ్లుమూసుకుని మీరు దర్శించుకున్న భగవంతుడి రూపాన్ని ధ్యానించండి. అప్పుడు కూడా మీకు దేవుడు కనిపించకపోతే మళ్లీ లోనికివెళ్లి దర్శించుకోండి. పైన ఉన్న శ్లోకాన్ని భక్తిపూర్వకంగా పఠించండి.
ఆలయంలో కొంతసేపు కూర్చోవడం వల్ల అక్కడున్న పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రభావం మీపై ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు మీనుంచి దూరమవుతాయి. పవిత్రమైన శ్లోకాలు, గంటల శబ్ధం మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఆలయంలో అనుభవించే ఆధ్యాత్మిక ఆనందం మీ మెదడులో కండరాలను ఉత్తేజపరిచేలా చేస్తుంది. ఆలయంలో ధ్యానం చేస్తే మీకు రెట్టింపు శక్తి లభిస్తుంది. అందుకే కాసేపు ఆ ప్రదేశంలో కూర్చోవాలి అని చెబుతారు.































