సాధారణంగా డిసెంబరు నెల సినిమా ఇండస్ట్రీలకు సీజనే. కాకపోతే ఓ మాదిరి హిట్స్, కలెక్షన్స్ మాత్రమే వస్తుండేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే సీన్ పూర్తిగా మారిపోయింది.
బాక్సాఫీస్‌కి తెగ కలిసొచ్చేస్తోంది. పాన్ ఇండియా మూవీస్ అయితే కొన్ని వారాల పాటు ఆడేసి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇంతకీ డిసెంబరు సంగతేంటి? ఏయే సినిమాలకు ఎలా కలిసొచ్చిందనేది చూద్దాం.
డిసెంబరు అంటే చలికాలం. క్రిస్మస్ పండగకు సెలవులు ఉంటాయి కాబట్టి చాలావరకు ఈ ఫెస్టివల్ టార్గెట్ చేసుకుని మూవీస్ రిలీజ్ చేస్తుంటారు. కానీ కొవిడ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఇదే నెలలో వివిధ తేదీల్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్నాయి. కొవిడ్ తర్వాత ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. 2021 నుంచి ప్రతి ఏడాది ఏదో ఓ సినిమా ప్రేక్షకుల్ని అలరించి వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతూనే ఉంది.
2020లో కరోనా రావడం వల్ల పెద్ద సినిమాల లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. చాలా చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. అలా 2021 డిసెంబరులో తొలుత ‘పుష్ప’ వచ్చింది. ఏ మాత్రం అంచనాల్లేకుండా రిలీజై పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దాదాపు నెలరోజుల పాటు సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఈ మూవీ ఒక ఊపు ఊపేసింది. వారం పదిరోజుల తర్వాత వచ్చిన రిలీజైన ‘అఖండ’ కూడా హిట్ అయింది. 2022లో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం టాలీవుడ్ నుంచి రాలేదు.
2023 డిసెంబరులోనూ టాలీవుడ్ బాక్సాఫీస్‌కి బాగా కలిసొచ్చింది. ఎందుకంటే నెల మొదట్లో సందీప్ రెడ్డి వంగా తీసిన ‘యానిమల్’ వచ్చి దుమ్ములేపింది. దర్శకుడు తప్ప మిగిలిన వాళ్లంతా హిందీ యాక్టర్సే అయినప్పటికీ తెలుగులోనూ అద్భుతమైన వసూళ్లు దక్కించుకుని ఆశ్చర్యపరిచింది. నెల చివరలో వచ్చిన ప్రభాస్ ‘సలార్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూ.600 కోట్ల మేర వసూళ్లు సొంతం చేసుకుంది.
గతేడాది జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పుష్ప’ మేనియాని కొనసాగిస్తూ సీక్వెల్‌ని గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి పార్ట్ ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తే.. దీనికి మాత్రం అంతకు మించి అనేలా స్పందన వచ్చింది. తెలుగు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఉత్తరాదిలో వచ్చిన కలెక్షన్స్ చూసి అందరికీ కళ్లు చెదిరిపోయాయి. చెప్పాలంటే మూవీ టీమ్ కూడా ఏకంగా రూ.1800 కోట్ల కలెక్షన్స్ వస్తాయని ఊహించి ఉండదు.
ఈ ఏడాది కూడా డిసెంబరులో బాగానే కలిసొచ్చింది. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన బాలీవుడ్ మూవీ ‘దురంధర్’.. అదిరిపోయే టాక్‌తో పాటు వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తుంది. హిందీ వెర్షన్ మాత్రమే ఉన్నప్పటికీ హైదరాబాద్ లాంటి చోట కూడా హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి. ఇక ‘అఖండ 2’ సీక్వెల్ తాజాగానే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడే దీని ఫలితం గురించి చెప్పలేం. ఎందుకంటే తొలి భాగంతో పోలిస్తే ఇందులో కాస్త అతి ఎక్కువైందని అంటున్నారు. కొన్నిరోజులు ఆగితే రిజల్ట్ ఏంటనేది క్లారిటీ వస్తుంది. ఇలా కొవిడ్ తర్వాత పాన్ ఇండియా సినిమాలకు డిసెంబరు అనేది లక్కీగా మారిపోయింది. చెప్పాలంటే ఇది ఎవరూ ఊహించలేదు. చూస్తుంటే ఇకపై సంక్రాంతి, దసరాలానే డిసెంబరు కూడా సినిమాలకు సీజన్ అయిపోతుందేమో చూడాలి?


































