ఇక్కడ మనుషుల కంటే గొర్రెల సంఖ్య ఎక్కువ.
ఈ ద్వీపంలో నివసించడంతో పాటు పని చేసేందుకు ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తోంది ఐలాండ్ ట్రస్ట్.
ఇది గ్వినెడ్‌లోని లున్ ద్వీపకల్పంలో ఉంది.
నిత్యం సముద్రపు గాలులతో చల్లగా ఉండే ఈ ద్వీపంలో విద్యుత్ సౌకర్యం లేదు.
ఇక్కడ జనాభా కేవలం ముగ్గురు మాత్రమే.
ఈ ద్వీపాన్ని 2023లో యూరప్‌లో ఇంటర్నేషనల్ డార్క్‌స్కై శాంక్చురీగా గుర్తించారు. దీనర్ధం ఏంటంటే రాత్రి వేళ ఇక్కడ నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే కాంతి కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది.
ఈ ద్వీపానికి యజమానిగానే కాకుండా దీన్ని నిర్వహిస్తున్న ట్రస్ట్ 20 ఏళ్లలో తొలిసారి ఒక కుటుంబం లేదా ఓ జంటను అక్కడ ఉండేందుకు ఆహ్వానిస్తోంది.
ఇది జీవిత కాలపు అవకాశమని చెబుతోంది.
బార్డ్సే ఐలాండ్‌లో నివసించేందుకు ట్రస్ట్ ఆహ్వానం పలుకుతోంది.
గొర్రెలు, బర్రెల్ని పెంచుకుంటూ..
ఈ ద్వీపంలో నివసించడానికి ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని బార్డ్సే ఐలాండ్ ట్రస్ట్ కోరింది.
ఎంపికైన అభ్యర్థులు 2026 సెప్టెంబర్ నుంచి ఇక్కడ నివసించాల్సి ఉంటుంది.
ఒక్కసారి ఇక్కడ నివాసం ఏర్పరచుకుని కుదురుకున్న తర్వాత, కొత్తగా వచ్చిన ఆ కుటుంబానికి 200 గొర్రెలు, 25 వేల్స్ నల్ల గేదెల్ని ఇస్తారు.
వారు ప్రస్తుతం ఇక్కడ ఉంటున్న గరేత్ రాబర్ట్స్ ఇంటి పక్కన ఉండవచ్చు.
“గరేత్ కుటుంబం 2007 నుంచి ఇక్కడ ఉంటోంది. ఈ ద్వీపంలో నివసించడంలో ఉన్న సవాళ్లు, లాభాల గురించి ఆయన బాగా తెలుసు” అని ట్రస్ట్ ప్రధాన అధికారి సియాన్ స్టేసీ చెప్పారు. కొత్తగా వచ్చేవారికి రాబర్ట్స్ అన్ని రకాలుగా అండగా ఉంటారని అన్నారు.
440 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చిన్న ద్వీపం నేషనల్ నేచర్ రిజర్వ్‌గా సైట్ ఆఫ్ స్పెషల్ సైంటిఫిక్ ఇంట్రస్ట్‌గా గుర్తింపు పొందింది.
“వ్యవసాయంలో అనుభవం ఉన్న కుటుంబం లేదా జంట కోసం మేం ఎదురు చూస్తున్నాం” అని ట్రస్ట్ అధికార ప్రతినిధి చెప్పారు. కొత్తగా వచ్చే కుటుంబం లేదా జంటకు ఐదేళ్ల పాటు ట్రస్ట్ అన్ని రకాలుగా అండగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఐలాండ్‌తో పాటు మరో 16 ప్రాంతాలను నిర్జన, దట్టమైన చీకటి ఉండే ప్రాంతాలుగా ఇంటర్నేషనల్ డార్క్ స్కై శాంక్చురీ సర్టిఫికేషన్ గుర్తించింది.
అయితే కొంతమంది వ్యక్తులు సీజనల్‌గా ఇక్కడకు వచ్చి తాత్కాలికంగా నివాసం ఉండి వెళుతున్నారు.
దీంతో ఈ ద్వీపాన్ని సజీవ సమాజ సమూహంగా అభివర్ణించారు సియాన్.
“నేనక్కడ మూడేళ్లుగా ఉన్నాను. ఇది చాలా అద్భుతమైన ప్రాంతం” అని ఆమె అన్నారు.
ప్రకృతి ప్రేమికులు సీజనల్‌గా ఈ ద్వీపానికి వస్తుంటారు.
బార్డ్సే ఐలాండ్ ప్రత్యేకతలు
ఇక్కడ వైఫై లేదు. కరెంట్ ఉండదు. నీళ్ల కోసం ఓ బావి ఉంది.
ఈ ద్వీపం పొడవు మైలున్నర, వెడల్పు అరమైలు ఉంటుంది.
కొన్ని శతాబ్దాలుగా దీన్ని బ్రిటన్‌లో పవిత్ర స్థలంగా భావిస్తున్నారు. బార్డ్సే ఐలాండ్‌ను ’20వేల మంది సాధువుల సమాధి స్థలం’గా భావిస్తారు. అప్పట్లో ఎన్లీ ద్వీపానికి మూడు తీర్ధయాత్రలు చేయడం రోమ్‌కు ఒక తీర్థయాత్ర చేసినట్లని నమ్మేవారు.
క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచి నుంచి తీర్ధయాత్రలు చేసేవారు, సముద్రపు దొంగలు, మత్స్యకారులు, రైతులు ఈ ద్వీపాన్ని సందర్శించేవారు.
1821లో ఈ ద్వీపపు దక్షిణ భాగంలో లైట్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు.
ఇది యూరప్‌లో తొలి డార్క్ స్కై శాంక్చురీ
30వేల జతల మాంక్స్ షియర్ వాటర్ పక్షుల సంతానోత్పత్తికి నిలయం.
ఇక్కడ స్కూళ్లు, షాపులు లేవు. 10 హాలిడే కాటేజ్‌లు ఉన్నాయి. మార్చ్- అక్టోబర్ మధ్య మాత్రమే సందర్శకులను ఈ ద్వీపంలోకి అనుమతిస్తారు.

































