ఈ ఊరు.. వైద్యుల పుట్టినిల్లు..!

ఏళ్ల కిందట ఆ గ్రామం కూడా ఓ మారుమూల పల్లెటూరే. వ్యవసాయం చేసుకుని.. కూలీ పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకునేవారు. కష్టాన్నే నమ్ముకుని జీవించేవారు. ఇప్పుడు ఆ ఊరు ఎనలేని ఖ్యాతిని గడిచింది. ఎంతో మంది విద్యావంతుల్ని తీర్చిదిద్దింది. ముఖ్యంగా అధిక శాతం మంది వైద్యులను అందించింది. అదే ఆమదాలవలస మండలంలోని కణుగులవలస. వైద్యుల ఊరుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ పల్లె గురించి నేడు ‘జాతీయ వైద్యుల దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..


ఆమదాలవలస పట్టణానికి రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న కణుగులవలసలో 3,200పైగా జనాభా ఉంది. 750 ఇళ్లు ఉన్నాయి. వాటిలో సుమారు 100 మందికిపైగా పేరొందిన వైద్యులుగా స్థిరపడ్డారు. దిల్లీ ఎయిమ్స్‌ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో వైద్య సేవలందిస్తున్నారు. ఇందుకు కారణం 1900లో దివంగత బొడ్డేపల్లి రామ్మూర్తినాయుడు ప్రారంభించిన ఓ పాఠశాల. అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకుని ఎంతో మంది ఉన్నత స్థానాలకు ఎదిగారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉండే రోజుల్లోనూ తల్లిదండ్రులు సైతం పిల్లలను తప్పనిసరిగా బడికి పంపేవారు. గ్రామంలోని యువత ఒకరినొకరు ఆదర్శంగా తీసుకుంటూ.. చదువులో పోటీ పడుతూ ఉన్నతోద్యోగాలు సాధించడంతో పాటు దేశవిదేశాల్లో స్థిరపడి ఊరికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. ఇప్పటికీ రామ్మూర్తినాయుడు కేటాయించిన స్థలంలోనే ప్రాథమిక పాఠశాల నడుస్తోంది.

ఇలా మొదలైంది…
గ్రామంలో గుంటముక్కల అప్పన్న, అన్నాజీరావు, అధికార్ల జగబందు మొట్టమొదట ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఆ తరువాత కాలంలో డాక్టర్‌ బెండి చంద్రశేఖరరావు (ఎంబీబీఎస్‌), నూక భాస్కరరావు (ఎం.ఎస్‌.), నూక చంద్రశేఖరరావు అల్లోపతి వైద్యులుగా సేవలందించేవారు. వారి నుంచి స్ఫూర్తి పొంది ప్రస్తుతం సంపతిరావు శ్రీదేవి (ఎం.ఎస్‌. గైనకాలజీ), బొడ్డేపల్లి సూర్యారావు (ఎం.ఎస్‌ ఆర్థో), సీపాన జయలక్ష్మి, సీపాన గోపి (న్యూరాలజిస్టు), బెండి తేజేశ్వరరావు (ఎం.ఎస్‌. సర్జన్‌), సీపాన సోమశేఖర్‌ (ఎండీ పీడియాట్రిక్‌), సీపాన రమేశ్‌ (ఈఎన్‌టీ), పంచాది శ్రీదేవి, బొడ్డేపల్లి సురేశ్, శ్రీనివాసరావు, తదితరులు పలు చోట్ల వైద్య నిపుణులుగా ఎదిగారు. వారిని ఆదర్శంగా తీసుకొని వారి పిల్లలు, మనమలు సైతం వైద్యవృత్తినే ఎంచుకుని ముందుకు సాగుతున్నారు.

స్వగ్రామంపై మమకారం చాటుతూ..
శ్రీకాకుళం నగరంలోనూ సుమారు 25 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారు. స్వగ్రామానికి చెందినవారు ఎవరైనా అనారోగ్యంతో వస్తే కొందరు ఉచితంగా వైద్యం చేస్తున్నారు. మరికొందరు ప్రత్యేక రాయితీపై మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. అప్పుడప్పుడు గ్రామంలో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తుంటారు.

నా విద్యార్థులే వైద్యం చేస్తున్నారు..
తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువే. ఇప్పుడు విద్య వ్యాపారంగా మారింది. మా గ్రామంలో బెండి చిట్టయ్య మాస్టారు వద్ద నేను ఉచితంగానే చదువుకున్నాను. ఉపాధ్యాయుడిగా నేను మా ఊర్లోనే సుమారు ఏళ్లు నిస్వార్థంగా పాఠాలు చెప్పాను. నా దగ్గర చదువుకున్న ఎంతో మంది అనేక రంగాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు నా వయసు 90 సంవత్సరాలు. నేను అనారోగ్యం బారిన పడినప్పుడు నా విద్యార్థులే ఇంటికి వచ్చి వైద్యం చేస్తుంటారు. దీన్ని పూర్వజన్మ సకృతంగా భావిస్తున్నాను.
బెండి కృష్ణారావు, విశ్రాంత ఎంఈవో, కణుగులవలస